Pawan Kalyan : పవన్ ఆ మూడింటికే పరిమితమయినట్లున్నారుగా.. అదే కారణమా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీకి కేటాయించిన మూడు శాఖలపై మాత్రం ఫోకస్ పెట్టారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీకి కేటాయించిన మూడు శాఖలపై మాత్రం ఫోకస్ పెట్టారు. ఉప ముఖ్యమంత్రిగా మిగిలిన శాఖలను ఆయన ఇటీవల కాలంలో పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏర్పాటయిన తొలినాళ్లలో హోంశాఖపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పుడు సంచలనమే అయ్యాయి. హోంమంత్రికి చేతకాకుంటే తాను ఆ శాఖను తీసుకోవాల్సి వస్తుందని కూడా అని ఆయన ఒకరకంగా టీడీపీకి కేటాయించిన శాఖలపై కూడా కాస్త కటువుగానే వ్యవహరించేవారు. కానీ గత కొద్ది రోజుల నుంచి మాత్రం తమ పార్టీకి కేటాయించిన శాఖల పర్యవేక్షణకు మాత్రమే పరిమితమయినట్లు కనిపిస్తుంది. మిగిలిన శాఖల జోలికి ఆయన పోవడం లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో...
ప్రధానంగా తాను నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు అటవీ శాఖపై కూడా ఇప్పటికే పట్టు సంపాదించిన పవన్ కల్యాణ్ స్థానిక సంస్థలకు నిధులను విడుదల చేయడంలో సక్సెస్ అయ్యారు. గ్రామీణ రహదారులను మెరుగుపర్చేందుకు కూడా నిధులను కేటాయించారు. ప్రతి గ్రామంలో రక్షిత మంచినీటి సదుపాయాన్ని కల్పించేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా రాష్ట్రానికి తీసుకు వచ్చి గ్రామీణాభివృద్ధి పాలనలో గతంలో ఎన్నడూ రాని విధంగా నిధులు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలతో ఉన్న సత్సంబంధాలతో మెరుగ్గా నిధులను రాష్ట్రానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.
సినిమా థియేటర్లలో...
ఇక తన పార్టీకి చెందిన కందుల దుర్గేష్ కు పర్యవేక్షిస్తున్న సినిమాటోగ్రఫీ, టూరిజంపైన కూడా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా సినీ థియేటర్లలో బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు నిచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. థియేటర్లలో సోదాలు, దాడులు చేయిస్తూ ఆహార పదార్థాల ధరలను తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. తన సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందు ఈ బంద్ నిర్ణయం పై ఆగ్రహంతో పవన్ ఈ దాడులు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపించినప్పటికీ థియేటర్లలో ఆహార వస్తువుల ధరలు పది నుంచి ఇరవై శాతానికి తగ్గిస్తూ యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవడంతో పవన్ చర్యల వల్లనేనని ప్రజలు భావిస్తున్నారు.
రేషన్ దుకాణాల్లో...
మరో ముఖ్యమైన శాఖ పౌర సరఫరాల శాఖ. ఈ శాఖ చాలా కీలకమైనది కూడా. పేదలతో నిత్యం టచ్ లో ఉండే శాఖ కావడంతో పవన్ దీనిపై కూడా దృష్టిపెట్టారు. పవన్ కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగి రేషన్ దుకాణాలను ఈ రోజు నుంచి రెండు పూటలా నిర్వహించేలా ఆదేశాలు విడుదల చేయించగలిగారు. అంతేకాదు ఆదివారం కూడా రేషన్ సరుకులు ఇవ్వాలని తెలిపారు. రేషన్ ను గత ప్రభుత్వం వాహనాల ద్వారా అందచేయడం వల్ల ఎక్కువగా దుర్వినియోగం అవుతుందని, అందుకే రేషన్ దుకాణాల ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించడం వెనక కూడా పవన్ కల్యాణ్ ఆలోచన ఉంది. రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు నూనె, పప్పు వంటి వస్తువులను కూడా చౌకగా సరఫరా చేయాలని నిర్ణయించారు.మొత్తం మీద పవన్ కల్యాణ్ మూడింటిపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. తమకు అప్పగించిన శాఖల్లో వైఫల్యం ఉండకూదన్నది ఆయన ఆలోచనగా ఉంది.