Ys Jagan : జగన్ నేతలకు అల్టిమేటం జారీ చేశారా? కట్టుతప్పుతున్నారని కస్సుమంటున్నారా?
వైసీపీ అధినేత జగన్ పార్టీనేతలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనిపిస్తుంది.
వైసీపీ అధినేత జగన్ పార్టీనేతలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనిపిస్తుంది. ఎవరికి వారే నిర్ణయాలు ప్రకటించడం ఇప్పుడు పార్టీలోనే కాదు రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. ప్రాంతీయ పార్టీ అంటే అధినేత ఆలోచనలను పసిగట్టి నేతలు మసులుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు నేతలు కట్టు తప్పుతున్నారని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. జగన్ ఆలోచనల ప్రకారం నేతలు నడుచుకోవడం లేదనడానికి ఇటీవల జరిగిన అనేక ఘటనలు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. జగన్ ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉండటంతో పాటు నేతలతో తరచూ సమావేశాలు కాకపోవడం వల్లనే ఈ రకమైన ఇబ్బందులు పార్టీలో తలెత్తుతున్నాయన్నది వాస్తవం.
2019 ఎన్నికలకు ముందు...
2019 ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట వేదవాక్కుగా నడిచేది. ఏ నిర్ణయమైనా అంతసులువుగా బయటకు చెప్పే వారు కాదు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే జగన్ తో మాట్లాడి వచ్చిన తర్వాత పార్టీ, ప్రభుత్వ ఆలోచనను ప్రజల ముందుంచేవారు. ఇక 2019 ఎన్నికల్లో పూర్తిగా జగన్ ఫొటోతోనే గెలిచామన్న భావనలో ఉన్న నేతలు పార్టీ నిర్ణయాలను తప్పుపట్టే సాహసం చేసేవారు కాదు. అందులో నిజం ఉందని చాలా మంది బహిరంగంగా అంగీకరించేందుకు కూడా మొహమాట పడేవారు కాదు. కాని ఎప్పుడైతే జగన్ అధికారానికి దూరమయ్యారో అప్పటి నుంచి అధినేతను కూడా లెక్క చేయని పరిస్థితి నేతల్లో కనిపించడం పార్టీ నాయకత్వంలో ఆందోళన కలిగిస్తుంది.
అనేక అంశాల్లో...
అమరావతి రాజధాని విషయంలోనూ అదే జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులను జగన్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. గత ఎన్నికల్లో అదే నినాదంతో వెళ్లారు. కానీ ప్రజలు ఆదరించలేదు. అయితే ఓటమి తర్వాత అమరావతిని రాజధానిగానే ఉంచుతామని ఇప్పుడు చెబుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అమరావతి విషయంలో తమ పార్టీ నిర్ణయం తప్పేనని అంగీకరించడం చర్చ జరుగుతోంది. ఇక విశాఖకు గూగుల్ డేటా సెంటర్ విషయంలోనూ తొందరపడి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ జగన్ మాత్రం గూగుల్ సెంటర్ ఏపీకి రావడం మంచిదేదని చెప్పారు. అలాగే ఇప్పుడు విపత్తుల సమయంలోనూ ఎలాంటి ప్రకటనలు ఎవరూ చేయవద్దని, జగన్ మాత్రమే ప్రకటిస్తారని పార్టీ నాయకత్వం నేతలకు అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. మరి నేతలు నాయకత్వం మాటలు విని మౌనంగా ఉంటారా? లేదా? అన్నది చూడాలి.