Weather Report : మరో మూడు నెలలు ఇక కష్టమే.. ఎండలు ముదిరాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది

Update: 2026-02-12 04:34 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 35 నుంచి 38 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. నిన్న మొన్నటి వరకూ ఉదయం, రాత్రి వేళలలో కొంత చలి తీవ్రత కనిపించినా అది కూడా ఇప్పుడు కనిపించడం లేదు. పూర్తిగా ఉక్కపోత వాతావరణం నెలకొంది. అనేక ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళల్లో రహదారులన్నీ ఖాళీలుగా దర్శనమిస్తుండటం విశేషం.

ఏజెన్సీ ఏరియాలోనూ...
ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం వేళ చలి తీవ్రత పూర్తిగా పోయింది. ఏజెన్సీ ఏరియాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత కొన్నాళ్లగా ఏపీ ప్రజలు పొగమంచు, చలి తీవ్రతతో ఇబ్బంది పడిన వారు నేడు పొగమంచు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి రెండో వారంలోనే ఈ పరిస్థితి ఉంటే మే నెలలో ఇంకెంతగా ఎండలు ఉంటాయన్న ఆందోళన ప్రజల్లో నెలకొని ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో కొంత తక్కువగానే ఉన్నప్పటికీ కోస్తాంధ్రలో మాత్రం గరిష్టంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి.
గరిష్ట ఉష్ణోగ్రతలు...
తెలంగాణలో ఉదయం కొంత చలి కొనసాగుతుంది. అలాగే సాయంత్రం వేళ కూడా కొద్దిగా చలి వాతావరణంకనిపిస్తుంది. పగటి వేళల్లో మాత్రం అత్యధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్టంగా 33 డిగ్రీలు తెలంగాణలో నమోదవుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సయితం చలితీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నెల నుంచి ఎండలు దంచి కొట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు మరో మూడు నెలలు ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News