YSRCP : సెంట్రల్ లో సమసిన విభేదాలు.. ఇద్దరూ కలవడంతో ఊపిరి పీల్చుకున్న..?

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య సఖ్యత కుదిరింది. అసంతృప్తి సమసిపోయినట్లే కనిపిస్తుంది

Update: 2024-01-25 07:14 GMT

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య సఖ్యత కుదిరింది. అసంతృప్తి సమసిపోయినట్లే కనిపిస్తుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును పార్టీ హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధినాయకత్వం హామీ ఇచ్చిందని చెబుతున్నారు. అయితే గత కొంతకాలంగా వెల్లంపల్లి శ్రీనివాసరావుకు మల్లాది వర్గం సహకరించడం లేదన్న విమర్శలున్నాయి.

సహకరించాలంటూ...
అయితే నిన్న తన వర్గంతో సమావేశమైన మల్లాది విష్ణు పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాలని కోరారు. ఎవరూ పార్టీ లైన్ ను దాటవద్దని చెప్పారు. కొత్త ఇన్‌ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు అందరం సహకరిద్దామని, సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించే దిశగా అందరం కృషి చేయాలని కోరారు. దీంతో గత కొన్ని రోజుల నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నెలకొన్న వివాదం సద్దుమణిగినట్లయింది.
పార్టీ కార్యాలయం...
ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లపల్లి శ్రీనివాసరావు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు. ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు చేతులు కలుపుకోవడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈసారి బరిలోకి దిగుతుండటంతో ఆయన గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఇద్దరు నేతల కలయిక పార్టీ క్యాడర్ లో జోష్ నింపినట్లయింది.


Tags:    

Similar News