బొత్సకు హెరిటేజ్ లీగల్ నోటీసు
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నోటీసులు ఇచ్చింది
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నోటీసులు ఇచ్చింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ తరపు న్యాయవాది జి. మల్లికార్జున రావు లీగల్ నోటీసు జారీ చేశారు.బొత్స సత్యనారాయణ నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా హెరిటేజ్ సంస్థపై తప్పుడు ప్రచారం చేశారని సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.క్షమాపణ చెప్పని పక్షంలో బి.ఎన్.ఎస్ చట్టంలోని సెక్షన్ 356 కింద పరువు నష్టం దావాతో పాటు సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇందాపూర్ డైరీతో సంబంధంపై...
మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థదేనని, దాని ద్వారానే గతంలో టీటీడీ నెయ్యి కాంట్రాక్టులు పొందారని బొత్స చేసిన ఆరోపణలను హెరిటేజ్ ఖండించింది. ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ ఫుడ్స్‌కు మధ్య కేవలం ఒప్పంద తయారీ సంబంధం తప్ప, యాజమాన్య పరంగా ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో కలిసి 'సిండికేట్'గా ఏర్పడిందన్న బొత్స వ్యాఖ్యలు అత్యంత అపవాదుతో కూడుకున్నవని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.