గుడ్ న్యూస్.. హైదరాబాద్ టు విజయవాడ దూరం..భారం తగ్గుతుందిగా

హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లే వారికి గుడ్ న్యూస్. రాజధాని అమరావతిలో మరో కీలకమైన ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి

Update: 2025-05-31 04:41 GMT

హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లే వారికి గుడ్ న్యూస్. రాజధాని అమరావతిలో మరో కీలకమైన ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతితో అనుసంధానమైన ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జ్​ నిర్మాణ పనులు శరవేగంగా మొదలు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాజధాని నుంచి విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారిని అనుసంధానించేందుకు కృష్ణా నదిపై ఆరు వరుసలతో ఐకానిక్‌ బ్రిడ్జ్ ని​ నిర్మించనున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి అమరావతిలోకి అడుగు పెట్టేందుకు ఇది ప్రధాన రహదారిగా మారనుంది. దీనివల్ల రెండు రాష్ట్ర రాజధానుల మధ్య దూరం తగ్గుతుంది. ఇది పూర్తయితే అమరావతికి మరో ముఖ్యమైన ప్రాజెక్టును ప్రభుత్వం అందించినట్లే అవుతుంది.

సమగ్ర సర్వేచేసి...
ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జ్​ కోసం సమగ్ర సర్వే చేసి డీపీఆర్‌ ఇచ్చేందుకు ఏడీసీఎల్‌ సలహా సంస్థ అంతా సిద్ధం చేస్తుంది. ఆర్‌ఎఫ్‌పీ కోసం బిడ్లను ఇప్పటికే ఆహ్వానించింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ సాంకేతిక బిడ్స్ ను వడపోత పట్టే స్థాయిలో ఉందని అధికారులు తెలిపారు. ఆర్థిక అంశాలను కూడా పరిశీలించిన తర్వాత కన్సల్టెంట్‌ను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఐకానిక్ బ్రిడ్జి కోసం ఇప్పిటికే అన్ని రకాలుగా పరీక్షలు పూర్తి చేయడంతో పాటు దానిని వేగంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పనులు ఎప్పుడు మొదలవుతాయన్న దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ దీనికి సంబంధించి చాలా వరకూ అధికారులు కసరత్తులు పూర్తి చేశారు.
ప్రధాన రోడ్లన్నీ...
నిధులు కూడా సిద్ధంగా ఉండటంతో ఇక వేగంగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. రాజధాని అమరావతిలోని ప్రధాన ఆర్టీరియల్‌ రోడ్లు ఎన్‌ 6, ఎన్‌ 13లను హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎన్‌ 6 రోడ్డు అనుసంధానం పూర్తి కావొస్తోంది. ఈ రోడ్డుపై జాతీయ రహదారుల సంస్థ చేపట్టిన సిక్స్ లేన్ పశ్చిమ బైపాస్‌ పనులు ముగింపు దశలో ఉన్నాయి. అదనంగా ఎన్‌ 13 రోడ్డును ఎన్‌హెచ్‌ 65తో కలపనున్నారు. ఇదే జరిగితే హైదరాబాద్ నుంచి అమరావతికివెళ్లే వారికి ఇక దూరం తగ్గడమే కాకుండా సత్వరం వెళ్లేందుకు అవకాశముంటుంది. రాజధాని అమరావతికి ప్రధాన ఆకర్షణగా ఈ ఐకానిక్ బ్రిడ్జి మారనుంది.


Tags:    

Similar News