Free Bus for Women : ఉచిత బస్సు రూటు మారింది... అదే జరిగితే ఏపీ మహిళలకు తీపికబురే
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పథకం అమలుకు సమయం దగ్గర పడటంతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఉచిత ప్రయాణంపై విధివిధానాలపై కూడా ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. జిల్లాల వరకే ఉచిత ప్రయాణం అని ఇప్పికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కొన్ని విమర్శలు తలెత్తుతున్నాయి. జిల్లాల సంఖ్య పెరగడంతో వాటి పరిధి తక్కువ కావడంతో ఉచితం ఇచ్చినా ప్రయోజనం లేదని చాలా మంది పెదవి విరుస్తున్నారు. కేవలం పట్టణాల్లో ఉండే మహిళలకు మాత్రమే ఈ ఫ్రీ బస్సు ఉపయోగపడుతుందన్న భావన సరర్వత్రా వ్యక్తమవుతుంది.
ఫ్రీ టికెట్ జర్నీ అందుకే...
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై కొంత పునరాలోచనలో పడింది. జిల్లాకు, జిల్లాకు మధ్య పెద్ద దూరం లేకపోవడంతో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టామన్న పేరు తప్పించి దానివల్ల వారిలో సంతృప్తి కూడా ఉండదని గ్రహించింది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఫ్రీ జర్నీ టికెట్ ను కూడా ఇవ్వాలని, దాని వల్ల ఆ మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా ఎంత ప్రయోజనం చేకూరిందన్నది అర్థమవుతుందని చెప్పారు. దీన్నిబట్టి మహిళలు ప్రయాణించే దూరాన్ని బట్టి ఫ్రీ జర్నీ టిక్కెట్ కూడకా ఇచ్చి వారికి డబ్బులు ఎంత మిగిలాయో వారికే చెప్పే విధంగా ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఉమ్మడి జిల్లాలకు మాత్రమే కాకుండా...
దీంతో పాటు ఉచిత ప్రయాణం కొత్త జిల్లాలయితే జిల్లాలు, జిల్లాకు మధ్య దూరం పది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. ఇందులో ప్రయాణించే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని, అందువల్ల మహిళలకు ఉచిత బస్సు పథకం ఆకట్టుకోలేకపోతుంది. అందుకే ఉమ్మడి పాత జిల్లాలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మరో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఎంపిక చేసిన కొన్ని బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించే ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే ఈ బస్సుల్లో ముందుగా అడ్వాన్స్ బుకింగ్ విధానాన్ని అమలు చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్నిబస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించామని పేరు తెచ్చుకునేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచన తెచ్చింది.
ముఖ్యమంత్రి ఆమోదం తర్వాతే...
ఆర్టీసీ ఆదాయానికి గండి పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1350 కొత్త బస్సులు కేటాయించనుంది. ఇప్పటికే 750 బస్సులు వచ్చాయని, మరో ఆరు వందల బస్సులు త్వరలోనే వస్తాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. వీటిలో కొన్ని బస్సులను మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణానికి వినియోగిస్తారు. ఈ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులే కావడంతో నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. విధివిధానాలను రూపొందించిన అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆయన ముందు పెట్టి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరి చంద్రబాబు చివరకు ఉమ్మడి జిల్లాల వరకే ఉచితాన్ని పరిమితం చేస్తారా? లేదా? అన్నది తేలనుంది.