Nandigam Suresh : ఆ ఫైర్ ఏదీ బ్రదరూ..ఒక్క కేసుతో ఇలా అయిపోయావేమయ్యా?
మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ ఒక్క కేసుతో ఒక పెదవులకు తాళం వేసుకున్నట్లుంది
మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ ఒక్క కేసుతో ఒక పెదవులకు తాళం వేసుకున్నట్లుంది. అధికారంలో లేనప్పుడు అంటే 2019 నుంచి 2024 వరకూ ఒక వెలుగు వెలిగిన నందిగం సురేష్ ఇప్పుడు పార్టీ నేతలకు కూడా దొరకడం లేదు. జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చినప్పుడు అలా హాజరు వేయించుకోవడం మినహా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నందిగం సురేష్ పై వరస కేసులు నమోదయ్యాయి. హత్య కేసుతో పాటు మరికొన్ని కేసులు నందిగం సురేష్ మెడకు చుట్టుకున్నాయి. దీంతో కొన్ని నెలల పాటు జైలు ఊచలను లెక్కపెట్టాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నందిగం సురేష్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు.
చిన్న వయసులోనే...
రాజధాని అమరావతి ప్రాంతంలో ఉండే ఈ యువనాయకుడు తొలిసారి బాపట్ల నియోజవర్గం నుంచి పోటీ చేసి పార్లమెంటులోకి అడుగుపెట్టాడు. చిన్నవయసులో పార్లమెంటు లోకి కాలు పెట్టడం అంటే ఎవరికీ రాని ఛాన్స్ జగన్ నందిగం సురేష్ కు ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వరకూ నందిగం సురేష్ అంటే ఎవరో పెద్దగా తెలియదు. రాజధాని అమరావతి ప్రాంతంలో పంటపొలాలు దగ్దం అయిన కేసులో నందిగం సురేష్ వెలుగులోకి వచ్చారు. రాజధాని ప్రాంతానికి చెందిన నందిగం సురేష్ కు జగన్ బాపట్ల పార్లమెంటు స్థానం టిక్కెట్ ఇచ్చారు. అనూహ్యంగా గెలుపొందిన సురేష్ తర్వాత పార్టీలో కీలకంగా మారాడు. చంద్రబాబుపైనా, లోకేశ్ పైనా మీడియా డిస్కషన్స్ లో విమర్శలు చేసి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.
నెలల పాటు జైల్లో ఉండటంతో...
బాపట్ల నియోజకవర్గం ఎంపీగా ఉన్న జగన్ కు అత్యంత ఇష్టమైన నేతగా ముద్రడపడ్డారు నందిగం సురేష్. చివరకు టిక్కెట్ల విషయంలో అభ్యర్థుల ప్రకటన కూడా నందిగం సురేష్ చేత జగన్ చేయించారు. జగన్ అంటే ప్రాణం ఇచ్చేందుకైనా సిద్ధమని అనేక సార్లు కామెంట్స్ చేసిన నందిగం సురేష్ మరోసారి బాపట్ల ఎంపీగా పోటీ చేసి 2024 ఎన్నికలలో దారుణ ఓటమిని చవి చూశారు. దీనికితోడు గతంలో తాను చేసిన విమర్శలతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా భావించి కూటమి ప్రభుత్వం నందిగం సురేష్ ను అరెస్ట్ చేయించింది. నెలల పాటు జైల్లో ఉండటంతో నందిగంలో ఫైర్ చల్లబడిందని అంటున్నారు. నాలుగేళ్ల పాటు మౌనంగానే ఉండటం మంచిదన్న భావనలో ఉన్నారు.
గతంలో ఎన్నడూ...
నందిగం సురేష్ గతంలో ఎప్పడూ ఇలా సైలెంట్ గా లేరు. కనీసం తాను ప్రాతినిధ్యం వహించిన బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం వైపు కూడా కన్నెత్తి చూడటం లేదు. రాజధాని ప్రాంతంలో ఉన్న తన ఇంటికే ఆయన పరిమితమయ్యారు. జగన్ తాడేపల్లికి వచ్చినప్పుడు కలవడం మినహా పెద్దగా యాక్టివ్ గా లేరని, హైదరాబాద్ టు అమరావతి ఎక్కువగా తిరుగుతున్నారని అంటున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంపై విమర్శల జోరు కూడా నందిగం సురేష్ తగ్గించారు. ఎందుకంటే మళ్లీ జైలు ఊచలు పిలుస్తాయేమోనన్నభయం ఆయనను వెంటాడుతుందని అంటున్నారు. అందుకే నందిగం సురేష్ లో నాటి ఫైర్ ఏదంటూ కొందరు వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండటమేంటని నిలదీస్తున్నారు.