Amaravathi : చంద్రబాబు సొంత ఇలాకాలోనే ఇబ్బందులు పడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇప్పుడు అమరావతి రైతుల్లోనే అసంతృప్తి పెరుగుతుంది

Update: 2025-07-16 08:13 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇప్పుడు అమరావతి రైతుల్లోనే అసంతృప్తి పెరుగుతుంది. ఇచ్చిన భూములను డెవలెప్ చేయకుండా ఇంకా భూములు కావాలంటూ సమీకరణకు సిద్ధమవుతుండటాన్ని తప్పుపడుతున్నారు. నిజానికి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు ధర్నాకు దిగాలని నిర్ణయించినా, అది నారా లోకేశ్ జోక్యంతో విరమించుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అంటే రైతులు మరో విడత భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ముందు తీసుకున్న భూములను అభివృద్ధి చేసిన తర్వాత మిగిలిన భూములను అవసరమైతే సేకరించడంలో తప్పులేదని, అదే సమయంలో ఒక్కటీ పూర్తి చేయకుండా, రైతులకు మేలుచేయకుండా మరోసారి భూ సమీకరణ చేయడాన్ని అమరావతి రైతులే ప్రశ్నిస్తున్నారంటే చంద్రబాబుకు ఊహించని షాక్ అని చెప్పక తప్పదు.

సోషల్ మీడియాలో సెటైర్లు...
ఇందుకు ఉదాహరణలతో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతూ సెటైర్లుపడుతున్నాయి. ఒక మెకానిక్ వద్దకు మోటారుబైక్ ను తీసుకెళి రిపేర్ చేయమంటే... దానిని బాగు చేసేలోపు మరొక బైక్ రాగానే దానికి మరమ్మతులుచేయడానికి వెళ్లినట్లుగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. అంటే ముందు ఇచ్చిన బైక్ రిపేర్ కాదు. తర్వాత ఇచ్చిన బైకుకు కూడా మోక్షం కలగదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు మరో విడత భూ సమీకరణ కూడా ఇలాగే ఉందని అంటున్నారు. అమరావతి భూ సమీకరణకు సీఆర్డీఏ సమావేశంలో అమోదించారు. దాదాపు రెండో విడత ఇరవై వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. ఇందుకు అధికారులతో పాటు ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగి రైతులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తీరుపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది.
ఇరవై వేల ఎకరాలు...
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటి పరిశ్రమల ఏర్పాటు కోసం రెండోదశ భూసమీకరణ చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం కొంతకాలం వెయిట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దాదాపు 20, 496 ఎకరాలు సమీకరణ కింద తీసుకోవాలని ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. దానిపై క్యాబినెట్లోనూ చర్చ జరిగింది. ఆమోదించిన సమయంలో ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలనే అంశం నిర్ణయించలేదు. దీంతో పూలింగ్ ప్రక్రియను ప్రారంభించలేదు. ఇప్పటికే. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అందరి కంటే ముందుగా అమరావతి మండల పరిధిలోని గ్రామాల్లో సమీకరణ ప్రక్రియపై రైతులతో సమావేశాలు నిర్వహించారు. అప్పట్లో రైతుల్లో పెద్దగా అవగాహన లేకపోవడంతో ఎమ్మెల్యే చెప్పారనే పేరుతో తలూపినా, ఈలోపు వారందరూ గత పూలింగు ఏరియాలో ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేసిన తర్వాత భూములు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో నోటిఫికేషన్ ను నిలిపేశారు.
పదేళ్లవుతున్నా...
గతంలో సమీకరణకు ఇచ్చిన ప్రాంతంలో ప్లాట్లనే అభివృద్ధి చేయలేదనే అంశంపై రాజధాని రైతులు అసంతృప్తిగా ఉన్నారు. తమకు డెవలెప్ చేసిన ప్లాట్లు ఇస్తే వాటిని విక్రయించి తమ పిల్లల పెళ్లిళ్లు జరపుకుంటామని, పదేళ్లవుతున్నా ఇంకా అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.కానీ రైతులకు త్వరలోనే అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా వారికి నమ్మకం కలగడం లేదు. ప్రతి పనికీ డెడ్ లైన్ పెట్టే చంద్రబాబు నాయుడు తమకు ఇచ్చే ప్లాట్ల విషయంలో మాత్రం డెడ్ లైన్ ఎందుకు పెట్టడం లేదని రైతులు నిలదీసేపరిస్థితికి వచ్చింది. రైతులకు ఇవ్వాల్సిన కౌలును చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నామని గ్రామాల్లో ప్రచారం చేశారు. మొత్తం మీద రెండో దశ భూసమీకరణ నిలిపేశారని అధికారులే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. త్వరలోనే పూలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల తర్వాతనే ప్రక్రియ మొదలవుతుందని చెబుతున్నారు. మరి రాజధాని రైతులు ఏ మేరకుసహకరిస్తారన్నది చూడాల్సి ుంది.


Tags:    

Similar News