Andhra Pradesh : వంగవీటి, వర్మలకు పదవులు రెడీ అయిపోయాయా?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాదికి పైగా సమయం గడిచిపోయింది. వంగవీటి రాధ, పిఠాపురం వర్మకు పదవులు దక్కలేదు

Update: 2025-09-08 08:04 GMT

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాదికి పైగా సమయం గడిచిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో టిక్కెట్లు త్యాగాలు చేసిన వారికి ఇప్పటి వరకూ పదవులు రాకపోవడంపై ఆ నియోజకవర్గాలతో పాటు, సామాజికవర్గాల్లోనూ పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అందులో అగ్రభాగాన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎస్ వర్మతో పాటు వంగవీటి రాధా కూడా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా వర్మ తన సీటును త్యాగం చేశారు. వంగవీటి రాధా కూడా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేశారు. ఇప్పుడు వీళ్లిద్దరికీ త్వరలో పదవులు దక్కనున్నాయన్న చర్చ జరుగుతుంది.

వర్మకూ ప్రయారిటీ...
పిఠాపురం నియోజకవర్గంలో వర్మ టీడీపీకి నమ్మకమైన నేత. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టిక్కెట్ కోల్పోయిన తర్వాత స్వయంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ పదవులు కొన్ని భర్తీ అయినా అందులో వర్మకు చోటు కల్పించలేకపోయారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అసహనంతో పాటు అసంతృప్తితో ఉన్నాయి. ఏ పార్టీ అయినా మరొక పార్టీని పూర్తిగా నమ్మకం పెట్టుకోదు. తన బలం ఆ నియోజకవర్గంలో తగ్గకూడదని భావిస్తుంది. టీడీపీ ఆలోచన కూడా అలాగే చేస్తుంది. అందుకే తాజాగా ఎస్.వి.ఎస్.ఎస్ వర్మ కు ప్రభుత్వం ఇద్దరు గన్ మెన్లను కేటాయించింది. దీంతో ఆయనకు కేబినెట్ పదవి లభిస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. కేబినెట్ ర్యాంకు పదవి ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అందుకే గన్ మెన్లను వర్మకు కేటాయంచారన్న టాక్ బలంగా వినిపిస్తుంది.
వంగవీటి రాధాకు కీలక పదవి...
మరొకవైపు కాపు సామాజికవర్గానికి చెందిన నేత వంగవీటి రాధాకు కూడా పదవి రెడీ అయిందంటున్నారు. ఆయనను అందుకే లోకేశ్ పిలిచి మరీ మాట్లాడారంటున్నారు. వంగవీటి రాధా హైదరాబాద్ లో ఉంటే అమరావతికి పిలిచి పదవిపై లోకేశ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. గంట సేపు ఇద్దరి భేటీ కొనసాగింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో పాటు వంగవీటి రాధాకు ఇంతవరకూ పదవి ఇవ్వకపోడంపై కాపు సామాజికవర్గంలో చర్చ జరుగుతుండటంతో టీడీపీ నాయకత్వం కూడా రాధాకు పదవి ఇవ్వాలని డిసైడ్ అయిందని అంటున్నారు. అయితే రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? లేక రాజ్యసభకు పంపుతారా? అన్నది తెలియకు్నా త్వరలో రాధాకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వస్తుందని అంటున్నారు. తనకు పదవి దక్కకపోయినా వంగవీటి రాధా టీడీపీకే మద్దతుదారుగా ఉండటంతో ఆయనకు త్వరలోనే పిలిచి మరీ పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News