TDP : చింతకాయల వారికి ఇక నో "చింత"
టీడీపీలో సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు త్వరలోనే కీలక పదవి లభించే అవకాశాలున్నాయి
టీడీపీలో సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు త్వరలోనే కీలక పదవి లభించే అవకాశాలున్నాయి. అయితే తొలుత విజయ్ ను రాజ్యసభ కు ఎంపిక చేయాలని భావించినప్పటికీ ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది. అయితే ఆయనకు కీలక పదవి రిజర్వ్ అయిందని, త్వరలోనే చింతకాయల విజయ్ సూపర్ పదవి దక్కబోతుందన్న సమాచారం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ గతంలో మాదిరిగా కాకుండా ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులన్నీ ఎక్కువగా యువతకే ఇస్తున్నారు. మంత్రివర్గంలో కావచ్చు. రాజ్యసభ స్థానాల్లో కావచ్చు.. మరేదైనా సరే యువతకు అవకాశం ఇస్తున్నారు.
వచ్చే పదవులన్నీ...
పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సీనియర్ నేతలను పార్టీ బలోపేతం కోసం వ్యూహాలను, రోడ్ మ్యాప్ లను సిద్ధం చేయడానికే పరిమితం చేయనున్నారు. వారి అవసరాలను, సేవలను పార్టీ వరకే ఉపయోగించుకున్నారు. ఇది ఫిక్స్. ఇక వచ్చే పదవులన్నీ యువతతోనే ఎక్కువగా నిండిపోతాయన్నది కూడా వాస్తవం. నారా లోకేశ్ భావి నేతగా ఎదుగుతున్న తరుణంలో ఆయన తనకంటూ ఒక టీమ్ ను సెట్ చేసుకోవడం ఇప్పటికే ప్రారంభమయింది. ఇంకా కొనసాగుతుందికూడా. అది ఎమ్మెల్సీ పదవి కావచ్చు. రాజ్యసభ పదవి కావచ్చు.. మరేదైనా కావచ్చు. వచ్చే పదవుల్లో ఎక్కువగా యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్సీని చేసి...
అందులో భాగంగా అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ ను ఎమ్మెల్సీని చేసి కేబినెట్ లోకి తీసుకోవాలని కూడా పార్టీ నాయకత్వం యోచిస్తున్నారని తెలిసింది. దేశ రాజకీయాలకంటే రాష్ట్ర రాజకీయాల్లోనే చింతకాయల విజయ్ ను ఉంచాలని భావిస్తున్నారు. అయ్యన్నపాత్రుడు కోరిక కూడా అదే. పార్టీ సోషల్ మీడియా విభాగంలో యాక్టివ్ గా పనిచేయడమే కాకుండా చింతకాయల విజయ్ నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడు. సామాజికవర్గం కోటా కూడా ఇందుకు పనిచేస్తుంది. మంత్రి వర్గ విస్తరణలో చింతకాయల విజయ్ ను కేబినెట్ లో తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. విజయ్ పడిన కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడమే కాకుండా 2029 ఎన్నికలకు విజయ్ బీసీ కోటా కింద ఎంపికవుతారన్న టాక్ పార్టీ వర్గాల్లో బలంగా ఉంది.