మంచి జరిగితేనే తోడుగా నిలవండి : జగన్

అబద్దాలు నమ్మవద్దని, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువవుతాయని , మంచి జరిగి ఉంటేనే తనకు తోడుగా నిలబడమని జగన్ కోరారు

Update: 2023-09-19 07:36 GMT

అబద్దాలు నమ్మవద్దని, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువవుతాయని అన్నారు. మంచి జరిగి ఉంటేనే తనకు తోడుగా నిలబడమని ముఖ్యమంత్రి జగన్ కోరారు. డోన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో పాలన మారిందన్నారు. యాభై ఇళ్లకు ఒక వాలంటీరు వచ్చారన్నారు. లంచాలకు తావులేకుండా పాలన చేస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. మీ గ్రామాల్లో జరిగే అభివృద్ధిని గమనించాలని కోరుతున్నానని ప్రజలను కోరారు. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. చంద్రబాబు హయాంలో దోచుకోవడం, దానికి దత్తపుత్రుడికి పంచిపెట్టడం మినహా మరేం జరిగిందని ప్రశ్నించారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు పాలనలో ఆయన దోపిడీకి కొన్ని మీడియా సంస్థలు కొమ్ముకాశాయన్నారు. అందరికీ సామాజికన్యాయం అందించడంలో తమ ప్రభుత్వానికి ఎవరూ సాటి లేరని చెబుతున్నానని అన్నారు.

నాలుగేళ్లలోనే...
అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లకే గాజులదిన్నె ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని జగన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కారణంగా డోన్, పాణ్యం, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందుతుందని అన్నారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. . ఈ ప్రాజెక్టుకు కృష్ణా జలాల కేటాయింపులు లేవని, అయినా నిర్మించుకున్నామని చెప్పారు. 250 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని అన్నారు. పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్ధ్యం పెంచుకునే పనికి కూడా తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాయలసీమలో కరువును తరిమికొట్టడానికే ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్పారు.
సీమలో ప్రాజెక్టులను...
రాయలసీమలో కేవలం వర్షపు నీరే దిక్కయిందని, అనేక ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకోవడం ద్వారా సాగును పెంచుకునే అవకాశం కలిగిందన్నారు. రాయలసీమ నీటి కష్టాలు తనకు తెలుసునన్న జగన్ హంద్రీనీవా ద్వారా ఈ నీటితో 77 చెరువులను నింపబోతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం భూములను సేకరించలేదు కాని టెంకాయలను మాత్రం కొనుగోలు చేసిందని విమర్శించారు. ప్రకాశం జిల్లా కరువు తీర్చడానికి వెలిగొండను పూర్తి చేసుకుంటున్నామని, అక్టోబరు నెలలో ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నట్లు జగన్ ప్రకటించారు. చంద్రబాబు పరిపాలనలో రాయలసీమలోని నీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. గతానికి, ఇప్పటికీ తేడా గమనించమని జగన్ కోరారు. ఇదే బడ్జెట్ లో ఎందుకు ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారన్నారు.


Tags:    

Similar News