Chandrababu : నెపం ఎమ్మెల్యేలపై నెట్టేస్తే సరిపోతుందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదే పదే ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు

Update: 2025-11-13 07:05 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదే పదే ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఎమ్మెల్యేలు సివిల్ తగాదాల్లో తలదూర్చడాన్ని తప్పుపడుతున్నారు. ఇలా కూటమిలోని ప్రధాన పార్టీలకు చెందిన పెద్దలే పార్టీ గాడి తప్పినట్లు ఒప్పుకున్నట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే పక్కదారి పడుతున్న ఎమ్మెల్యేలను సెట్ చేయడానికే చంద్రబాబు కానీ, పవన్ కల్యాణ్ కానీ ఈ వ్యాఖ్యలు చేస్తుండ వచ్చు. ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ఎన్నికల్లో పనిచేయదు. ఖచ్చితంగా అది ప్రభుత్వంపైనే ప్రభావం చూపుతుంది. ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు.

ఎమ్మెల్యేలను తప్పుపడితే...?
ఎమ్మెల్యేలు పనితీరు ఎంత ముఖ్యమో.. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుల పనితీరు కూడా అంతే ముఖ్యమన్నది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇప్పటికే ఎన్నికలు జరిగి రెండేళ్లు దాటి పోయింది. ఇప్పుడు కూడా ప్రతిదీ గత ప్రభుత్వంపై నెపాన్ని మోపి కాలం గడిపేద్దామంటే కుదరని పని. అదే సమయంలో మంచి పనులు అంటే.. ఏంటి? వంద మందిలో పది మందికి మంచి జరిగితే తొంభయి మందికి అది వ్యతిరేకమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వం కూడా సంక్షేమాన్ని విస్తృతంగా చేసినా పదకొండు సీట్లకే పరిమితమవ్వడానికి ప్రధాన కారణం మెజారిటీ ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు దక్కకపోవడంతో పాటు సమస్యలు పరిష్కారం కాకుండా ఉండటమేనన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు.
జబ్బలు చరుచుకున్నా...
తాము సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో తీసుకెళుతున్నామని చెబుతున్నప్పటికీ రహదారులు బాగుంటేనే ఫీల్ గుడ్ కొంత వరకైనా వస్తుంది. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రైతులు సంతోషంగా ఉంటేనే వారు మళ్లీ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతారు. అలాగే నిరుద్యోగులు, మహిళల విషయంలోనూ అదే జరుగుతుంది. అందుకని సంక్షేమ పథకాలను కొందరికే ఇచ్చి తాము బాగా చేస్తున్నామని జబ్బలు చరుచుకుంటూ, ఎమ్మెల్యేల పనితీరును తప్పుపడుతూ కూర్చుంటే చివరకు పుట్టి మునిగేది ఖాయమన్నది గతంలో అనేక ఎన్నికల ఫలితాలు చాటి చెప్పాయి. ఎమ్మెల్యేలు సక్రమంగా చేసినా పక్క వాడికి అందిన పథకం తమకు దక్కకపోతే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. అది ముఖ్య నేతలు గమనించాలని కిందిస్థాయి నేతలు కోరుతున్నారు. అలాగే కార్యకర్తలు కూడా పార్టీ నిలదొక్కుకోవడానికి, ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి కీలకమని గుర్తించాల్సి ఉంటుంది.


Tags:    

Similar News