BJP : బీజేపీపై ఆర్ఎస్ఎస్ ప్రభావం పనిచేస్తుందా? అందుకే ఈ ఎంపికలా?
భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక మైన నిర్ణయాలను తీసుకుంటుంది
భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక మైన నిర్ణయాలను తీసుకుంటుంది. బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్లను, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవాళ్లు, కమిట్ మెంట్ తో పనిచేసిన వాళ్లకు మాత్రమే అవకాశాలు కల్పిస్తామని చెప్పకనే చెబుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను కొంత పక్కన పెడుతున్నట్లే కనపడుతుంది. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్లో కొంత అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. అయినా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ప్రస్తుతానికి ఏమీ మాట్లాడేందుకు బయటకు రాకపోయినా వారు మాత్రం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ముఖ్యమైన పదవులు...
తెలంగాణలో కేంద్ర మంత్రి పదవులు రెండు ఇచ్చారు. అందులో ఒకటి కిషన్ రెడ్డి కాగా, మరొకరు బండి సంజయ్. ఇద్దరూ పార్టీలో సీనియర్ నేతలు. పార్టీతో దశాబ్దకాలం అనుబంధం ఉన్న వారు. ఇక్కడ సామాజికవర్గాలను చూడకుండా కేవలం పార్టీకి నిబద్ధతతో పనిచేసిన వారికి మాత్రమే అవకాశం కల్పించారు. రాజ్యసభ స్థానాన్ని కూడా పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న కె. లక్ష్మణ్ కు కేటాయించారు. అంతే తప్ప మరొకరికి ఈ అవకాశం ఇవ్వలేదు. ఇక తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు అనేక ఆశలు పెట్టుకున్నారు. కానీ అందరి ఆశలను తలకిందులు చేస్తూ పార్టీకి విధేయుడిగా ఉంటున్న కె.రామచంద్రరావును బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు.
అన్ని పదవులూ వారికే...
ఆంధ్రప్రదేశ్ లోనూ అంతే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే తమకు మంత్రి పదవి ఖాయమని చాలా మంది అంచనాలు వేసుకున్నారు. కానీ వారిందరినీ పక్కన పెట్టి సత్యకుమార్ యాదవ్ ను మంత్రి పదవికి ఎంపిక చేశారు. ఇక కేంద్ర మంత్రివర్గంలో పురంద్రీశ్వరి లాంటి వాళ్లను పక్కనపెట్టి శ్రీనివాసవర్మ లాంటి పార్టీకి నిబద్ధత కలిగిన నేతను ఎంపికచేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా పాకా వెంకట సత్యనారాయణ ఎంపిక కూడా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇక తాజాగా పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మాధవ్ ను ఎంపిక చేయడంతోనే ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పదవులు ఉండబోవన్న సంకేతాలు ఇచ్చినట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.భవిష్యత్ లోనూ ఎంపికలు ఇలాగే ఉంటాయని చెబుతుండటంతో పార్టీ మారి వచ్చిన నేతలు కొంత పునరాలోచనలో పడినట్లు తెలిసింది.