టీడీపీతో పొత్తుపై నేడు క్లారిటీ
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నేడు భీమవరంలో జరగనున్నాయి. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రి మురళీధరన్ హాజరుకానున్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నేడు భీమవరంలో జరగనున్నాయి. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రి మురళీధరన్ హాజరుకానున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేకపోవడతో టీడీపీతో పొత్తుపై బీజేపీ అధినాయకత్వం ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. మురళీధరన్ ద్వారా కేంద్ర నాయకత్వం పార్టీ నేతలకు ఈ సమావేశంలో క్లారిటీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలన్న సంకేతాలను ఇవ్వనుంది.
ఒంటరిగా పోటీ చేసేందుకు...
పార్టీని బలోపేతంగా చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని, జనసేన తమతో కలసి ఉన్నా, లేకపోయినా పట్టించుకోకుండా ఒంటరిపోరుకే సిద్ధమవ్వాలన్న సందేశాన్ని భీమవరం మీటింగ్ లో ఇవ్వనున్నారు. జనసేన పార్టీ తమతో పొత్తు పెట్టుకుంటే పరవాలేదని, అలాగని వెళతానంటే ఎవరికీ అభ్యంతరం లేదని కూడా హైకమాండ్ ఈ సందర్భంగా నేతలకు చెప్పనుంది. దీంతో ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. కేంద్ర మంత్రి మురళీధరన్ ద్వారా తమ అభిప్రాయాన్ని కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతలకు ఇవ్వనుందని చెబుతున్నారు.