Cold Alert : రికార్డు బ్రేక్ చేస్తున్న చలి.. గతంలో ఇంత వణుకు ఎప్పుడొచ్చిందంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది

Update: 2025-12-18 04:01 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి పడిపోతున్నాయి. దాదాపు 2015లో ఇటువంటి చలిగాలులను చూశామని ప్రజలు చెబుతున్నారు. అంటే పదేళ్ల తర్వాత తిరిగి ఇటువంటి చలితీవ్రతను ఎదుర్కొంటున్నామని అంటున్నారు. అయితే భారత వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది అన్ని అతిగానే ఉంటాయని చెప్పింది. ఎండలు, వానలు, చలి కూడా ఎక్కువగానే ఉంటుందని ముందుగానే హెచ్చరించింది. ఆ మేరకే అనేకప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. ఇక మరో రెండు రోజుల పాటు ఇదేరకమైన వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

అన్ని ప్రాంతాల్లో చలిగాలులు...
ఆంధ్రప్రదేశ్ చలిగాలులతో అల్లాడిపోతుంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రత కారణంగా ఏపీలోని అనేక ప్రాంతాలు వణుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అన్ని చోట్ల అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు కంటిమీద కునుకు కరువయింది. ప్రధానంగా ఉదయాన్నే పనులకు వచ్చే కూలీలు, చిరు వ్యాపారులు, ఉద్యోగులపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. మరొక రెండు రోజుల పాటు చలితీవ్రత ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక పొగమంచు కూడా ప్రయాణం చేసే వారిని అనేక ఇబ్బందులపాల్జేస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరెంజ్ అలెర్ట్ జారీ...
ఇక తెలంగాణలోనూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణలో అయితే రాత్రి పూట ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలో ఇప్పటికే విద్యుత్తు వినియోగం కూడా కనిష్టానికి పడిపోయింది. పగలు, రాత్రి వేళల్లో ఫ్యాన్లు కూడా వేసుకోవడం మానేశారు. ఇక తెలంగాణ ప్రాంతంలో పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. ఉదయం 9 గంటల వరకూ పొగమంచు వీడటం లేదు. వాహనదారులు ఖచ్చితంగా లైట్లు వేసుకుని ప్రయాణించాలని కోరుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Tags:    

Similar News