AP Politics : ఇద్దరికీ అవసరమే.. కలసి పోటీ అనివార్యమే.. ఆ ప్రచారం అంతా బోగస్సే

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి టీడీపీతో కలసి వెళ్లడం అనివార్యం

Update: 2025-12-18 09:40 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి టీడీపీతో కలసి వెళ్లడం అనివార్యం. వచ్చే ఎన్నికల్లోనూ కలసి వెళ్లడానికే ఎక్కువ మొగ్గు చూపుతుంది. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా కూటమిలో విభేదాలు అన్నది అవాస్తవం అని భావించాల్సి ఉంటుంది. ఇటీవల నరేంద్ర మోదీ పార్టీ ఎంపీలతో భేటీ అయినప్పుడు ఏపీకి చెందిన బీజేపీ నేతలతో చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఫ‌లానా వ్య‌క్తితో క‌లిసి ప‌నిచేయండని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇప్పటి వరకూ ఎప్పుడూ ఎవ‌రికీ చెప్పిన‌ట్టు విన లేదు. కానీ, తొలిసారి ఏపీలోని చంద్ర‌బాబుతో క‌లిసిముందుకు సాగాల‌ని పార్టీ నాయ‌కుల‌కు తేల్చి చెప్పారు. దాదాపు 25 సంవ‌త్స‌రాల‌కు పైగానే ముఖ్య‌మంత్రిగా, ప్ర‌ధాన మంత్రిగా అధికారంలో ఉన్న మోడీ ఇప్పుడు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆదిశ‌గా పార్టీనాయ‌కుల‌కు దిశానిర్దేశం చేయ‌డం అంటే ఆనకు స్పష్టమైన నివేదికలు అంది ఉంటాయని భావిస్తున్నారు.

మొన్నటి ఎన్నికల్లో...
బీజేపీకి మొన్నటి ఎన్నికల్లోనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదీ బీజేపీ బలంగా ఉండే ఉత్తరాదిలో బీజేపీ తక్కువ స్థానాలను తెచ్చుకోవడం వల్లనే ప్రతిపక్ష ఇండి కూటమి బలంగా ఆవిర్భవించింది. ఇప్పటికే పదిహేనేళ్లు పాలన గడవడంతో సహజంగా ప్రజల్లో ఉండే అసంతృప్తి తమకు ఇబ్బందికరమవుతుందని భావించిన మోదీ కూటమి పార్టీలను మరింత బలోపేతం చేసే పనిలో పడినట్లు కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు ఏపీకి వచ్చారంటే అందులో భాగంగానే చూడాలి. జగన్ తమతో నేరుగా కలవరు. చంద్రబాబు నేరుగా పొత్తు పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ, జనసేనలు వచ్చే ఎన్నికల్లోనూ కలసి పనిచేస్తాయి.
దక్షిణాదిన మరింత బలపడాలంటే?
ఉత్తరాదిలో బలహీనపడినా దక్షిణాదిలో మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ బలంగా ఉంది. మూడు చోట్ల అధికారంలో ఉంది. ఇక తెలంగాణలో కొంత బలం పుంజుకుంటే గతం కంటే ఎక్కువ స్థానాలను సాధించవచ్చు. అందుకే తెలంగాణ బీజేపీ నేతలకు క్లాస్ పీకినట్లు వార్తలొచ్చాయి. ఇక కేరళలోనూ తిరువనంతపురం కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడం శుభపరిణామం. అలాగే తమిళనాడు ఎన్నికల్లోనూ వచ్చే ఏడాది సత్తా చూపించాలని చూస్తున్నారు. కర్ణాటకలో ఎటూ తమకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. అందుకే చంద్రబాబు చేయిని వదిలిపెట్టేందుకు మోదీ సుముఖంగా లేరు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ట్రాష్ గానే చూడాలి. కూటమితో కలసి నడవటం ఇటు చంద్రబాబుకు, అటు మోదీకి కూడా అవసరమే. 2029 ఎన్నికల్లో కూటమి కలసి పోటీ చేసి మెజారిటీ స్థానాలను సాధించాలన్న లక్ష్యంతోనే మోదీ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అనుకోవాలి.


Tags:    

Similar News