Andhra BJP : ఏపీ బీజేపీ రాజ్యసభ అభ్యర్థి పేరు వింటే మీరు నోరు తెరవాల్సిందేనట
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. నాలుగు రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. అయితే నాలుగు రాజ్యసభ స్థానాలను కూటమ పార్టీలు గెలుచుకుంటాయి. ఇప్పటికే టీడీపీకి రెండు, బీజేపీ, జనసేనలకు చెరొక స్థానం ఇవ్వాలని నిర్ణయం జరిగిపోయిందంటున్నారు. టీడీపీ నుంచి సానా సతీష్ కు మరొకసారి పదవిని రెన్యువల్ చేస్తారు. ఇక జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తుంది. కాకుంటే ఇక బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. అయితే అనేక మంది సీనియర్ నేతలు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పెద్దల సభకు తమ పేరు పరిశీలనలోకి తీసుకోవాలని ఇప్పటికే ఢిల్లీ నాయకత్వాన్ని కలిసినట్లు సమాచారం.
ఇద్దరు ప్రయత్నిస్తున్నా...
మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లు కూడా తమకు రాజ్యసభ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. రాజంపేటతో పాటు చిత్తూరు నియోజకవర్గంలో బలపడాలంటే నల్లారికి పదవి ఇవ్వాలని కొందరు టీడీపీ అగ్రనేతలు కూడా బీజేపీ కేంద్ర నాయకత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం అందుతుంది. కానీ పార్టీ కేంద్ర నాయకత్వం ఆలోచన వేరుగా ఉంటుంది. గతంలో రాజ్యసభ పదవి ఖాళీ అయిన పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నేత పాకా వెంకట సత్యనారాయణను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అందులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఉండటంతో ఆయనకు టిక్కెట్ దక్కడం కష్టమేనని అంటున్నారు.
సీమ ప్రాంతం నుంచి ...
జీవీఎల్ నరసింహారావు కూడా గతంలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఉండి పదవీ విరమణ చేశారు. జీవీఎల్ గత ఎన్నికల్లో విశాఖపట్నం టిక్కెట్ ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా అది టీడీపీకి వెళ్లింది. దీంతో జీవీఎల్ నరసింహారావు పేరు కేంద్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈసారి రాయలసీమలో బలపడేందుకు అక్కడి నుంచి నేతను ఎంపిక చేసే అవకాశముందని అంటున్నారు. పార్టీ లో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న విష్ణువర్థన్ రెడ్డి పేరును కూడా కేంద్ర నాయకత్వం పరిశీలనలో అగ్రభాగాన ఉన్నట్లు సమాచారం. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ సీటును ఏపీ నేతలకు ఇస్తుందా? లేక ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడి నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా తెలిసింది. మొత్తం మీద ఎప్పటిలాగానే ఈసారి కూడా బీజేపీ రాజ్యసభ అభ్యర్థి పేరు సర్ ప్రైజ్ గానే ఉంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి.