YSRCP : ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారే... మెరుపు తీగలా మారారుగా?
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లోనూ, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లోనూ కనిపించడం లేదు. వైసీపీ నేతలపై వరస కేసులు నమోదవుతుండటంతో తనను లక్ష్యంగా పెట్టుకుంటారన్న కారణంతోనే అనిల్ కుమార్ యాదవ్ కొంత పార్టీకి దూరంగా మసలు కుంటున్నారని తెలిసింది. మొన్నటి ఎన్నికల్లో కూటమి గెలవడంతో అక్కడ టిడిపి పట్టు బిగిస్తోంది. అయినా వైసీపీ నేతగా, మాజీ మంత్రిగా పార్టీకి పూర్వవైభవం తేవాలన్న ప్రయత్నం అనిల్ కుమార్ యాదవ్ చేయకపోవడాన్ని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు, తర్వాత చాలామంది వైసీపీ నేతలు టిడిపిలో చేరిపోయారు.
పార్టీలో ఉన్నారా?
అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. అప్పుడప్పుడు కనిపించినా అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. అసలు ఆయన పార్టీలో ఉన్నారా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సొంత సామాజిక వర్గం వారిని కాదని అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చారు జగన్. కానీ ఇప్పుడు వైసిపి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కనిపించకపోవడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. నెల్లూరు టౌన్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ జగన్ కేబినెట్ లో మంత్రిగా చేరారరు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గెలవలేదు.
జగన్ ప్రాధాన్యమిచ్చినా...
వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2014లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ టిడిపి అధికారంలోకి వచ్చింది. అయినా సరే దూకుడుగా వ్యవహరిస్తూ.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారిపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం.. నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలవడంతో మంత్రివర్గంలో ఆయనకు చాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సొంత సామాజిక వర్గం నేతలు ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. అయితే అనిల్ తీరుకు నిరసనగా చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కాదు.. నెల్లూరు జిల్లాలో దారుణ పరాజయం చూసింది.
పోటీ చేసి ఓటమిపాలయిన...
అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నుంచి నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది.కూటమి హవాలో ఆయన ఓటమి తప్పలేదు. అయితే ఓడిపోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పుడప్పుడు చుట్టూ చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించడం లేదు. అందుకే అనిల్ కుమార్ యాదవ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వేరే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్టివ్ అయితే తప్ప వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే తనకు నెల్లూరు అర్బన్ ఇన్చార్జి పదవి ఇవ్వాలని అనిల్ కుమార్ యాదవ్ కోరుతుంటే.. అందుకు జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ యాక్టివ్ అయితేనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కే అవకాశముంది.