Andhra Pradesh : రాజకీయ పరిణామాలతో రాజ్యసభ పదవి ఆయనకే ఫిక్సయిందా?
ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. అయితే ఇందులో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ, మరొకటి జనసేనకు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అయితే జనసేన పార్టీ నుంచి కమ్మ సామాజికవర్గం నుంచి లింగమనేని రమేష్ కు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ నుంచి రెండింటిపై ఒక దానిపై క్లారిటీ వచ్చినట్లయింది. మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైసీపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని ల పదవీ కాలం పూర్తవుతుంది. అలాగే టీడీపీకి చెందిన సానా సతీష్ పదవి ఖాళీ అవుతుంది. దీంతో సానా సతీష్ కు తిరిగి పదవి రెన్యువల్ అవ్వనుంది.
నాలుగు ఖాళీ అవుతున్నా...
నిన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశంలోనూ రాజ్యసభ పదవులపై చర్చకు వచ్చినట్లు సమాచారం. బీజేపీ చివరి నిమిషంలో తన అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. అలాగే టీడీపీ నుంచి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. లింగమనేని రమేష్ కు కనుక రాజ్యసభ స్థానం ఇస్తే కమ్మ సామాజికవర్గానికి టీడీపీ కోటా కింద దక్కే అవకాశాలుండవు. ఎందుకంటే జనసేన, టీడీపీ ఇద్దరు కమ్మ సామాజికవర్గాలకే పదవులు ఇచ్చాయన్న విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకే ఈ సామాజికవర్గం నేతలు ఆశిస్తున్న దేవినేని ఉమ వంటి వారికి ఈసారి అవకాశం ఉండకపోవచ్చు. బీజేపీ ఎవరికి ఇస్తుందన్నది తెలియకపోయినా టీడీపీ, జనసేనలలో ఒక పదవి మాత్రమే కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
టీడీపీ నుంచి...
దీంతో ఇప్పుడు జనసేన నుంచి లింగమనేని రమేష్ ను ఎంపిక చేస్తే టీడీపీ నుంచి వంగవీటి రాధా పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వంగవీటి రాధాకు గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. ఆయనకు ఏ పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి కాపు సామాజికవర్గంలో ఉంది. అలాగే ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా కాపులకు ఇచ్చేందుకు అవకాశాలున్నాయని చెప్పాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి తర్వాత కొంత కాపు సామాజికవర్గంలో టీడీపీపై కొంత అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలోనే వంగవీటి రాధాకు ఇవ్వాలని దాదాపుగా చంద్రబాబు డిసైడ్ చేసినట్లు సమాచారం. వంగవీటి రాధాను ఇప్పటి వరకూ పదవులకు దూరంగా ఉంచడం కూడా సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో ఆయనకే ఎక్కువ అవకాశాలున్నాయి.