Ap Politics : సీను సీనుకు సీటీ కొట్టేస్తున్నట్లు ఏపీ రాజకీయాలున్నాయిగా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సిల్వర్ స్క్రీన్ పై ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి

Update: 2025-05-26 08:56 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సిల్వర్ స్క్రీన్ పై ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. కామెడీతో పాటు కథ.. సాగతీత.. డైరెక్షన్ ఇలా ఒకటేమిటి.. ఏపీ రాజకీయాల్లో కావాల్సినంత సినిమా కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఎవరైనా సమ్మెకు ఎప్పుడైనా దిగే అవకాశముంది. అయితే అది తమ నేతకు సంబంధించిన సినిమా విడుదలయినప్పుడే ఈ థియేటర్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం ఏంటన్న ప్రశ్న మాత్రం ఎవరికీ అర్థం కాకుండా ఉంది. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ వచ్చే నెల 12వ తేదీ విడుదలవుతున్న సందర్భంగా జూన్ ఒకటోతేదీ నుంచి సమ్మెకు దిగాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు.

అసలు కారణమిదేగా?
అయితే దీనిని జనసేన నేతలు తప్పుపడుతున్నారు. నిజానికి థియేటర్లకు నష్టం వస్తున్నది జనాల రాక. జనాలు ఎందుకు వస్తున్నారన్న విషయం మాత్రంపై ఎగ్జిబిటర్లు ఇంత వరకూ దృష్టి పెట్టలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. సినిమాకు వెళితే టిక్కెట్ ధర వందల రూపాయలు ఉండగా, అంతకు మించి చిరుతిండ్ల ధరలు ఉండటం కూడా ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేసిందనే చెప్పాలి. ఎటూ మూడు నెలల్లో ఓటీటీలోకి వస్తుందని భావించి అంత డబ్బును భరించలేక సినిమాను చూసేందుకు థియేటర్లకు కూడా రాలేకపోతున్నారు. పాప్ కార్న్ నాలుగు వందల రూపాయలా? సమోసా రెండు నూట నలభై రూపాయలా? ఈ రేట్లు బయట చూసుకుంటే ఇంత అబ్ నార్మల్ గా ఉన్నప్పటికీ ప్రభుత్వం కానీ, థియేటర్ల యాజమాన్యం కానీ పట్టించుకోవడం లేదు.
మాటల యుద్ధంతో...
మరొక వైపు ఇప్పుడు థియేటర్ల ఎగ్జిబిటర్ల నిర్ణయంతో ఇటు జనసేన అటు వైసీపీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎగ్జిబిటర్లు తమకున్న సమస్యలను చెప్పుకునే వీలుంది. అలాగే వాటిని పరిష్కరించాల్సింది డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు. అందుకే వారు తమ ప్లాట్ ఫారంలో చర్చించి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కేవలం థియేటర్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంటే పవన్ కల్యాణ్ సినిమాను దెబ్బ కొట్టినంత మాత్రాన నష్టపోయేది థియేటర్ల యజమానులే. ఆ విషయం వారికి కూడా తెలుసు. కానీ ఇది అటు ఇటు తిరిగి రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై పవన్ కల్యాణ్ కార్యాలయం స్పందించడంతో మరింత జటిలమయింది.
నాడు చేసిన వ్యాఖ్యలను...
తాము వ్యాపారాలు చేసుకునే వారమని, ప్రభుత్వంతో ఏం సంబంధమని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. కానీ అదే సమయంలో జనసేన నేతలు కూడా గతంలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం హయాంలో తన సినిమా విడుదల చేసిన సమయంలో చేసిన కామెంట్లతో కూడిన వీడియోలను విడుదల చేస్తున్నారు.ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఏముందనినాడు ప్రశ్నించిన పవన్ ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎందుకు కలవలేదంటూ సినీ పెద్దలను ప్రశ్నించడం ద్వారా కొంత నాలుక మడత వేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక చర్చలు జరపడానికి తాము సిద్ధమంటూ ప్రభుత్వం ప్రకటించినా ఎగ్జిబిటర్లు మాత్రం తమ సమస్య ప్రభుత్వం వద్ద లేదని, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల వద్దనే ఉందని చెబుతున్నారు. ఈ థియేటర్ల బంద్ మొదలయ్యే అవకాశం పెద్దగా లేకపోయినా ఏపీ రాజకీయాలు మాత్రం ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ చుట్టూనే తిరుగుతున్నాయి.


Tags:    

Similar News