Chandrababu : చంద్రబాబుకు టాలీవుడ్ దూరమయిందా? ఆయన దూరంగా ఉంటున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కు టాలీవుడ్ దూరమయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి

Update: 2025-05-19 08:50 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, రెండు సార్లు విభజిత ఏపీలోనూ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి దాదాపు యాభై ఏళ్లు అవుతున్నప్పటికీ ఆయన కు తొలి నుంచిటాలీవుడ్ తో మంచి సంబంధాలున్నాయి. అసలు ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు టాలీవుడ్ లో అగ్రస్థానంలో కొన్ని దశాబ్దాల పాటు వెలిగి చివరకు పార్టీ ని పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీకి, టాలీవుడ్ కు మధ్య సంబంధాలు దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ హయాం నుంచి ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని చంద్రబాబు కూడా కొనసాగించారు.

ఎన్నికల ప్రచారంలోనూ...
చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా టాలీవుడ్ కు చెందిన వారిలో ఎవరో ఒకరు రాజ్యసభ లేదా పార్లమెంటు సభ్యులుగానో ఉండేవారు. ఎన్నికల ప్రచారంలోనూ టాలీవుడ్ నుంచి ఆయనకు సహకారం అందేది. చంద్రబాబు అంటే టాలీవుడ్ కు ప్రత్యేక అభిమానం ఉంది. అదే ఆయనను టాలీవుడ్ కు దగ్గర చేసింది. ఎన్నికల ప్రచారంలో దశాబ్దాల క్రితం సినిమాల్లో యాడ్స్ తో పాటు పాటలు వంటివి కూడా టాలీవుడ్ నుంచి వచ్చేవి. దర్శకులు, నిర్మాతలు, నటులు ఇలా 24 ఫ్రేమ్స్ నుంచి ఆయనకు వెన్నంటే ఉండేవారు. అలాగే ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా టాలీవుడ్ నుంచి వచ్చి అందరూ కలిసేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలసి అభినందనలుచెప్పి వెళ్లేవారు.
నామినేటెడ్ పోస్టుల్లో ...
అంతేకాదు చంద్రబాబు కూడా వివిధ నామినేటెడ్ పోస్టుల్లో టాలీవుడ్ కుచెందిన వారిని నియమించేవారు. 2014 లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎస్వీబీసీ ఛానల్ కు ఛైర్మన్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును నియమించేవారు. నాడు మురళీ మోహన్ ఎంపీగా ఉండటంతో ఆయన అంతా తానే అయి టాలీవుడ్ ను చంద్రబాబు చెంతకు చేర్చేవారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు కూడా వచ్చి చంద్రబాబును కలసి తమ సమస్యలను విన్నవించుకునే వారు. అలాంటిది కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం టాలీవుడ్ నుంచి చంద్రబాబు వద్దకు వచ్చిన వారు తక్కువేననిచెప్పాలి. హైదరాబాద్ కు వచ్చినప్పుడు కలవడమే తప్ప ప్రత్యేకంగా అమరావతికి వచ్చి కలిసిన వారు ఎవరూ లేరు.
పవన్ ఉండటంతో...
దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్. టాలీవుడ్ ను శాసిస్తున్న మెగా కుటుంబానికి చెందిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటం, సినిమాటోగ్రఫీ మంత్రిగా జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేశ్ కూడా ఉండటంతో చంద్రబాబు ఇక తనంతట తానే టాలీవుడ్ కు దూరమయినట్లు అంటున్నారు. పవన్ కల్యాణ్ అంటేనే టాలీవుడ్ కు చెందిన వారు కలుస్తారు. ఆయనకు సీనీరంగంలో ఉన్న పరిచయాలతో ఆ పరిశ్రమలో ఉన్న సమస్యలు కూడా తెలుసు. అందుకే ఆ విషయాల్లో తాను జోక్యం చేసుకోవడం అనవసరమని భావించి చంద్రబాబు టాలీవుడ్ కు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కల్యాణ్ హర్ట్ అవుతారేమోనని భావించి చంద్రబాబు తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. నిజంగా నలభై ఏళ్ల తర్వాత చంద్రబాబు టాలీవుడ్ కు దూరమయ్యారా? అన్న టాక్ మాత్రం చిత్ర పరిశ్రమలో బలంగా వినిపిస్తుంది.


Tags:    

Similar News