Ambati Rambabu : అంబటిని వదిలేటట్లు లేరుగా.. అయినా తగ్గేదేలే అంటున్న రాంబాబు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై వరస కేసులు నమోదవుతుండటం కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టేటట్లే కనిపిస్తున్నాయి

Update: 2026-02-12 06:53 GMT

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై వరస కేసులు నమోదవుతుండటం కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టేటట్లే కనిపిస్తున్నాయి. గతంలో పోసాని కృష్ణ మురళిపై కూడా ఇలాగే వరస కేసులు నమోదు చేశారు. అయితే అప్పుడు సోషల్ మీడియాలో ఇంతటి వ్యతిరేకత కనిపించలేదు. కానీ అంబటి రాంబాబు విషయంలో మాత్రం కాపు సామాజికవర్గం నుంచి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు కనపడుతుండటమే ఇందుకు నిదర్శనం. అంబటి రాంబాబు చంద్రబాబును దూషించడం తప్పే. దానికి ఎవరూ మద్దతివ్వడం లేదు. ఆ కేసులో అంబటి రాంబాబును చట్టపరంగా శిక్షించాల్సిందే. అయితే చంద్రబాబును దూషించిన కేసులో అంబటి రాంబాబుకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఇళ్లపై దాడులు చేయడాన్ని..
అంబటి రాంబాబు చంద్రబాబును దూషించడం నేరమంటూనే.. ఆయన ఇంటిపై మహిళలు ఉన్న సమయంలో దాడులు జరపడం, తర్వాత వరస కేసులు బనాయించడమేంటన్న ప్రశ్నలు ఎక్కువగా కాపు సామాజికవర్గం నేతల నుంచే వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్ధించరు. కానీ ఆ విషయంలో ఇళ్లపై దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, మహిళలను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు ఇలా వరసగా కేసులు నమోదు చేయడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంబటి రాంబాబుపై ఇంకా ఎన్ని కేసులు పెడతారని ప్రశ్నిస్తున్నారు. ఇళ్లపై దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడమేంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఇంకా సిద్ధమవుతున్నాయా?
అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్రంలో 36 ఫిర్యాదులు నమోదు కావడంతో అక్కడ కేసులు నమోదవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ వస్తుందని తెలిసి ముందుగానే అంబటిపై మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ పై వైసీపీ ఆందోళన చేసిన సమయంలో పోలీసుల విధులను అడ్డుకున్నారని పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ కేసులోనూ అంబటికి బెయిల్ లభించింది. ఇక వెంటనే సత్తెనపల్లిలిలో 2023లో సంక్రాంతి పండగ సందర్భంగా లాటరీ తీసి కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదుతో మరొక కేసు నమోదు చేసి గుంటూరు కోర్టులో హాజరు పర్చారు. ఇంకెన్ని కేసులు అంబటిపై సిద్ధం చేశారని సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.






Tags:    

Similar News