Adip Raj : గెలిచి నిలుస్తాడనుకుంటే.. ఇలా అయిపోయాడేంటబ్బా?

పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అడ్రస్ లేకుండా పోయారు.

Update: 2025-10-13 08:10 GMT

పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అడ్రస్ లేకుండా పోయారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో పట్టు సంపాదించకోవాల్సిన అదీప్ రాజ్ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కనిపించడం లేదు. బలమైన నేతలున్న పెందుర్తి నియోజకవర్గంలో ఎగసిపడిన యువకెరటం ఇప్పుడే లేవలేకపోతుందంటున్నారు. పడి లేచిన కెరటాలను చూశాం కానీ.. పడి ఇక లేవలేని యువకిశోరాన్ని ఈయన్నే చూస్తున్నామంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి, జగన్ చరిష్మా తోడయి పెందుర్తి నుంచి అదీప్ రాజ్ విజయం సాధించారు. అయితే ఆయన గెలిచిన తర్వాత ప్రజలను పెద్దగా పట్టించుకోకపోవడంతో గత ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. ఎంతగా అంటే మొన్నటి ఎన్నికల్లో 80 వేల పైచిలుకు తేడాతో ఓటమి పాలయ్యారు.

సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకూ...
అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో ఉండేవారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాంపురం పంచాయతీ సర్పంచ్‌గా పని చేశారు. తర్వాత విశాఖపట్నం జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2015లో పెందుర్తి నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారర. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. జెయింట్ కిల్లర్ గా పేరుపొందారు.
అదృష్టంతో గెలిచి...
పెందుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం అంత బలంగా లేకపోవడం అదీప్ రాజ్ కు కలసి వచ్చింది. 1978 లో పెందుర్తి నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పది సార్లు పెందుర్తి శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ పదకొండు ఎన్నికల్లో నాలుగు సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, మూడుసార్లు తెలుగుదేశంపార్టీ గెలిచింది. ఒకసారి సీపీఐ, ప్రజారాజ్యం, స్వతంత్ర అభ్యర్థులు, వైసీపీ, జనసేన విజయం సాధించారు. గతంలో ఇక్కడ తెలుగుదేశం పార్టికి చెందిన బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. పలు సర్వేల్లో పెందుర్తి నియోజకవర్గంలో అదీప్ రాజ్ కు మంచి మార్కులే పడటంతో 2019 ఎన్నికల్లో ఆయనే టిక్కెట్ ఇచ్చారు. లక్కుతో పాటు గాలి తోడై గెలుపొందారు.
ప్రత్యామ్నాయం తప్పదా?
అదీప్ రాజు యువకుడు కావడం, గత కొన్నేళ్లుగా ప్రజలతో మమేకమవ్వడం పార్టీకి కలసి వస్తుందనుకుంటే గత కొన్ని నెలల నుంచి ఆయన క్యాడర్ కు అందుబాటులో లేకుండా పోయారంటున్నారు. అదీప్ రాజు పార్టీ జెండాను వదలకుండా యువకుడు కావడంతో పట్టుకుని పోరాడాతడని భావించిన వైసీపీ నాయకత్వానికి మాత్రం అతని వైఖరి మింగుడు పడని విధంగా తయారైంది. దీంతో అదీప్ రాజ్ ను యాక్టివ్ అవ్వాల్సిందిగా పలుమార్లు పార్టీ నాయకత్వం హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఆయన ఇప్పటికీ పెద్దగా యాక్టివ్ కాకపోవడంతో వైఎస్ జగన్ ప్రత్యామ్నాయ నేత కోసం చూస్తున్నారని తెలిసింది. చిన్నవయసులో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎదిగి చివరకు ఇలా అయిపోయాడేంటబ్బా అని జనం బుగ్గలు నొక్కుకుంటున్నారు.
Tags:    

Similar News