Chandrababu : ముస్తాబు ను ప్రారంభించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రామాన్ని సందర్శించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రామాన్ని సందర్శించారు. అక్కడి సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మాట్లాడిన ముఖ్యమంత్రిచంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. పిల్లలకు మంచి భవిష్యత్ అందించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
పారిశుధ్య పనుల పరిశీలన
తాళ్లపాలెం పర్యటనలో భాగంగా సీఎం పారిశుధ్య కార్మికులతో కలిసి గ్రామంలో నడిచారు. పరిశుభ్రత, పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి అనిత, అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.