వీర్రాజు మౌనం వెనక?

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్యాడర్ కు కన్పించడం లేదు

Update: 2023-09-14 05:22 GMT

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్యాడర్ కు కన్పించడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అందరికీ అందుబాటులో ఉంటూ యాక్టివ్ గా ఉండే సోము వీర్రాజు పదవి నుంచి దిగిపోయిన తర్వాత మాత్రం పత్తా లేకుండా పోయారు. ఆయన స్థానంలో పురంద్రీశ్వరి నియామకం తర్వాత ఆయన అడ్రస్ ను కనుక్కోవడం కూడా కార్యకర్తలకు కష్టంగా మారిందంటే అతిశయోక్తి కాదేమో. ఆయన ఎక్కడకు వెళ్లారు? ఏం చేస్తున్నారు? అన్న దానిపై పార్టీ నేతల్లోనూ,క్యాడర్ లోనూ పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.

ఎన్నికలకు ఇంకా…
ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఎంతో లేదు. తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉంది. సోము వీర్రాజు ఇతర నేతల్లాగా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న ఆయన కమలం పార్టీకి వీరాభిమాని. అలాంటి సోము వీర్రాజు కీలకమైన ఎన్నికల సమయంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం నిజమైన పార్టీ అభిమానుల్లో కలవరం రేపుతుంది. ఆయనకు ఓటు బ్యాంకు సమకూర్చే సత్తా లేకపోవచ్చు. కానీ పార్టీ పట్ల నిబద్ధత పుష్కలంగా ఉండటం వల్ల ఆయన ఎప్పటికీ పార్టీకి దూరం కారన్న భావన ఉన్నప్పటికీ ఏమై పోయారన్న దానిపై ఆరా మొదలయింది.
పదవి నుంచి…
పురంద్రీశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత తొలి నాళ్లలో కొంత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సోము వీర్రాజు ఆ తర్వాత నుంచి కనిపించడం మానేశారు. కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణ‍యం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారా? లేదంటే వ్యక్తిగత పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారా? అన్నది తెలియకున్నా కీలకమైన సమయంలో మాత్రం సోము వీర్రాజు కన్పించక పోవడం, ఆయన మాటలు వినిపించకపోవడం పార్టీ క్యాడర్ కు పెద్ద లోటుగానే చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణలో పార్టీ నాయకత్వాన్ని మార్చినా అక్కడి అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం యాక్టివ్ గానే ఉన్నారు. కానీ సోము మాత్రం కామ్ గా ఉండటమేంటన్నది టాపిక్ గా మారింది. సోము వీర్రాజు పెద్ద వక్త కాకపోయినా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కావడంతో ఆయన కస్టాలు కొని తెచ్చుకున్నారని క్యాడర్ కూడా అభిప్రాయపడుతుంది.
ఈ సమయంలో…
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. టీడీపీ నేత చంద్రబాబును సీఐడీ అవినీతి కేసులో అరెస్ట్ చేసింది. ఆయన రాజమండ్రిలోనే ఉన్నారు. సోముది కూడా సొంత ప్రాంతం రాజమండ్రి. సింపతీ వస్తుందని టీడీపీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు.మరో వైపు అధికార వైసీపీ మరికొన్న కేసులు బనాయించి జైలులోనే చంద్రబాబును ఉంచాలని భావిస్తున్న తరుణంలో కీలక నేత, బీజేపీ మాజీ అధ్యక్షుడు మౌనంగా ఉండటంపై చర్చ జరుగుతుంది. తమ పార్టీకి ఈ అంశం ఏమాత్రం సంబంధం లేకపోయినా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదే సమయం. బీజేపీ నేతలందరూ ఏకమై తమ పార్టీని మరింతగా గ్రామస్థాయికి తీసుకెళ్లి అవినీతి పార్టీలపై పోరాటం చేయాల్సి ఉంటుంది. కానీ సోము వీర్రాజు వంటి నేతలు మౌనంగా ఉండటంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మరి సోము వీర్రాజు ఆచూకీ కోసం క్యాడర్ మాత్రం వెతుకుతూనే ఉంది.


Tags:    

Similar News