Tirumala : నేడు తిరుమలకు వెళ్లేవారికి అలెర్ట్.. దర్శనం కోసం?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు పెరిగింది.

Update: 2026-02-06 03:30 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు పెరిగింది. గత నాలుగు రోజుల నుంచి భక్తుల రద్దీ కొంత తక్కువగా కనిపించినప్పటికీ ఊహించిన విధంగానే శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి వారి దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. కంపార్ట్ మెంట్లు చాలా వరకూ నిండిపోయాయి. మూడు రోజుల పాటు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము చేస్తున్నామని, భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

వసతి గృహాలకు...
తిరుమలకు వచ్చే భక్తులు వీకెండ్ లో ఎక్కువగా ఉండటంతో అవసరమైన వసతి గృహాలు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఎక్కువ మంది భక్తులు వసతి గృహాల కోసం చాలా సేపు ఈ మూడు రోజుల్లో నిరీక్షణ చేయాల్సి వస్తుంది. లడ్డూ కౌంటర్, అన్న ప్రసాదం వద్ద కూడా భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. అయితే తిరుమలకు వచ్చే భక్తులకు కావాల్సినన్ని లడ్డూలు అందచేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనితిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అలాగే అన్న ప్రసాదం కూడా అందరికీ అందుతుందని తెలిపారు.
శ్రీవారి హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకుపైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 61,655 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,003 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News