నాడు జెఠ్మలానీ… నేడు లూథ్రా

నాడు జగన్ కేసులో రామ్ జెఠ్మలానీ, నేడు చంద్రబాబు కేసులో సిద్ధార్థ లూద్ధ్రాలు వారి అభిమానుల ఆశలు నీరు గార్చారు.

Update: 2023-09-11 04:18 GMT

కోట్లు ఖర్చు పెట్టి న్యాయవాదులను తెచ్చుకుంటే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. సెక్షన్లు పకడ్బందీగా ఉన్నా, ఆధారాలు సక్రమంగా ఉన్నా ఎంతటి న్యాయవాది వాదన అయినా నెగ్గడం అంత సులువు కాదు. నాడు జగన్ అయినా.. నేడు చంద్రబాబు అయినా కోట్లు కుమ్మరించి లాయర్లను దిగుమతి చేసుకున్నా ఫలితం కన్పించలేదు. తాజాగా చంద్రబాబు స్కిల్ డెవలెప్ మెంట్ కు సంబంధించిన కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించడాన్ని ఆ కోవలో చూడాల్సిందే.

జెఠ్మలానీని తెచ్చినా…
దాదాపు పదకొండేళ్ల క్రితం జరిగిన సంఘటనలను ఒకసారి చూస్తే అది నిజమేననిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ పై అనేక ఆరోపణలు ఎదురయ్యాయి. సీబీఐ విచారించింది. 2012 మే నెలలో అనుకుంటా. జగన్ ను మూడు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారణ చేశారు. మూడో రోజు విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ను అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ నాడు ప్రకటించింది. అయితే జగన్ తరుపున నాడు న్యాయస్థానంలో వాదనలను వినిపించడానికి రామ్ జెట్మలానీ, వచ్చారు. సుశీల్ కుమార్ షిండే వంటి వారు కూడా వాదించారు.
అంచనాలు తలకిందులై…
దీంతో జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెట్మలానీ ఎంట్రీతో జగన్ సులువుగా ఈ కేసు నుంచి బయట పడతారని భావించారు. జగన్ జైలుకు వెళ్లరని అంచనా వేశారు. కానీ వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. నాడు జగన్ పదహారు నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అంత త్వరగా కూడా జగన్ కు బెయిల్ రాకపోవడం ఏంటన్న దానిపై పెద్దయెత్తున చర్చ జరిగింది. ట్రయల్ కోర్టు తీర్పు తర్వాత నాడు జగన్ తరుపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఊరట లభించలేదు. చివరకు సుప్రీంకోర్టులో కూడా జగన్ తరుపున న్యాయవాదుల వాదనలు వీగిపోయాయి.
నేడు చంద్రబాబు…
అలాగే ఇప్పుడు చంద్రబాబు స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో ఇరుక్కున్నారు. తొలిసారి అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ జరగడమే ఒక ఆశ్చర్యకరం. ఎందుకంటే చంద్రబాబు ఎవరికీ దొరకరు. చిక్కరు. అన్నీ వ్యవస్థల్లో ఆయన ఫ్యాన్స్ కోకొల్లలుగా ఉంటారంటారు. అందుకే నాలుగు పదుల రాజకీయ జీవితంలో ఏనాడు చంద్రబాబు కోర్టు మెట్లు ఎక్కలేదు. జైలు గడప తొక్కలేదు. ఆయన సమర్థులైనా అతి కాస్ట్లీ లాయర్లను ఎంగేజ్ చేసుకుని తనపై నమోదయిన కేసుల్లో స్టే లు కూడా తెచ్చుకున్నారంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని భావించారు. పైగా సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో సాంకేతికంగా నిలబడే అవకాశం లేదని కూడా కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు.
కోట్లు కుమ్మరించి…
దాదాపు తొమ్మిది గంటల పాటు ఉత్కంఠ ఎట్టకేలకు తొలిగిపోయింది. కోట్లు ఖర్చు చేసి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను రంగంలోకి దించడంతో తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు కోర్టు నుంచి కరకట్ట మీద భవనానికి వెళతారని భావించారు. కానీ లూధ్రా వాదనలను కూడా న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా చంద్రబాబుకు రిమాండ్ తప్పలేదు. తన నలభై పదుల రాజకీయ జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లడం కర్మఫలమే కావచ్చు. ఏపీ ముఖ్యమంత్రులుగా పనిచేసి తొలిసారి జైలుకు వెళ్లిన రికార్డును కూడా చంద్రబాబు దీంతో తన సొంతం చేసుకున్నట్లయింది.


Tags:    

Similar News