Telangana : గంటల తరబడి నిరీక్షణ.. బస్తా దొరకడమూ గగనమే

తెలంగాణలో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు

Update: 2025-08-19 11:51 GMT

తెలంగాణలో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా నిలుచున్నా యూరియా బస్తా దొరకడం కూడా గగనంగా మారింది. గత కొద్ది రోజులుగా సహకార సంఘాల కార్యాలయాల్లో గంటల తరబడి వేచి చేసినా దొరకడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. రేయింబవళ్లూ అక్కడే ఉన్నప్పటికీ చివరకు యూరియా లేదన్న సమాధానంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. చెప్పులు క్యూలైన్ లో పెట్టి మరీ ఎదురు చూపులు చూస్తున్నారు. భారీ వర్షంలోనూ క్యూ లైన్ లో ఉండి ఎదురు చూస్తున్నారు. అధికారులు తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన యూరియాను విడుదల చేయాలని పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నేడు ఆందోళనకు దిగారు.

బస్తా కూడా దొరకక...
తెలంగాణకు కేటాయించిన యూరియాను బీజేపీ పాలిత ప్రాంతాలకు పంపుతున్నారంటూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతుందని ఎంపీలు ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా, వర్షాలు సమృద్ధిగా పడుతున్నప్పటికీ యూరియా కొరతతో రైతాంగం ఇబ్బందులు పడుతుంది. గంటల తరబడి క్యూ లో నిల్చున్నప్పటికీ తమ వంత వచ్చేసరికి బస్తా అయినా దొరకకపోతుందా? అన్న ఆశతో అన్నదాతలు పనులు మానుకుని సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. చివరకు ఒక్కొక్కరికి ఒక్క బస్తా ఇస్తుండటంతో అది సరిపోదని కూడా మరికొందరు వాపోతున్నారు.
నాట్లు వేసి ఇన్ని రోజులవుతున్నా...
రైతులు వరి నాట్లు వేసి నెలన్నర దాటుతున్నప్పటికీ యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన చెంతున్నారు. రేపు రా, మాపురా అంటూ తమను తిప్పుకుంటున్నారే తప్పించి యూరియా బస్తాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా రైతుల ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. ఎప్పుడూ లేనిది ఈ ఏడాది యూరియా కొరత ఎందుకు వచ్చిందని బీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో యూరియా కొరతతో ఖరీఫ్ సీజన్ లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణకు యాభై వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఏ మేరకు యూరియా సరఫరా అవుతుందన్నది చూడాలి


Tags:    

Similar News