Andhra Pradesh : నాదెండ్ల గారూ.. గోనెసంచెలకూ దిక్కులేదటయ్యా?

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన శాఖలో జరిగే విషయాలను పట్టించుకోవడం లేదు

Update: 2025-12-09 08:09 GMT

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన శాఖలో జరిగే విషయాలను పట్టించుకోవడం లేదు. రైతులు గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు గోనెసంచీలు లేక అవస్థలు పడుతున్నారు. వరికి గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వం పై విమర్శలు చేయడం మాని నాదెండ్ల మనోహర్ రైతుల గోడును పట్టించుకోవాలని కోరుతున్నారు. దిగుబడి తగ్గడమే కాకుండా, ఖర్చు ఎక్కువయి.. గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. వరికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎకరాకు నలభై నుంచి యాభై బస్తాలు పండాల్సిన వరి, ఈ ఏడాది ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చిందని రైతులు వాపోతున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు..
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. టోకెన్లు ఇంత వరకూ జారీ కాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. తేమ ఎక్కువగా ఉందని అధికారులు కొనుగోలుకు తిరస్కరిస్తున్నారు. గోనె సంచిలు కూడా తమకు అందడం లేదని రైతులు చెబుతున్నారు. 48 గంటల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినప్పటికి ఇప్పటి వరకూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవలేదు. దీంతో కొందరు రైతులు రోడ్లపైనే ధాన్యం ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిల్లర్లు సిండికేట్ అయి రైతులను దోచుకుంటున్నారని అన్నదాతలు ఆవేశంగా చెబుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లో ఈ వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నష్టానికి అమ్ముకోవడానికి...
తేమ 16 శాతం ఉంటేనే కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు షరతులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లాలోనే ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ఏడాది 2,500 నుంచి 2,700 క్వింటాల్ కు పలికిన ధర ఈ ఏడాది పదిహేను వందల నుంచి పదిహేడు వందల రూపాయలకు పడిపోయిందని రైతులు చెబుతున్నారు. గిట్టుబాటు ధరలు రాకపోవడంతో రైతులు గోదాముల్లో ధాన్యాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మోంథా, దిత్వా తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన రైతులు, ఎకరాకు పదివేల రూపాయల వరకూ నష్ట పోవాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్లు తమ మీద పడి వడ్డీతో పాటు కట్టాలని హుకుం జారీ చేస్తున్నారన్నారు. నాదెండ్ల మనోహర్ ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతులను దళారులను దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News