చుక్కలు చూపిస్తున్న టమాటా.. అన్ని కూరగాయల ధరలు ఆకాశంలోనే
ఒక్కసారిగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి
ఒక్కసారిగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. టమాటా ధరలు మరింత పెరిగాయి. ఎప్పుడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు అరవై రూపాయలకు చేరువలో ఉన్నాయి. బయట మార్కెట్ లో కిలో టమాటా యాభై నుంచి అరవై రూపాయలకు పైగానే విక్రయిస్తున్నారు. మరో వారం రోజుల్లో కిలో టమాటా ధర మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. దిగుమతులు తగ్గడంతో పాటు రాష్ట్రంలో దిగుబడులు కూడా తగ్గడంతో టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కొనుగోలు చేసేవారు కూడా తగ్గుతున్నారని, ధరను చూసి గతంలో కిలో కొనుగోలు చేసే వారు ఇప్పుడు పావు కిలో మాత్రమే కొనుగోలు చేస్తారని చెబుతున్నారు.
దిగుబడులు తగ్గి...
టమాటా లేకుండా వంటింట్లో ఏ వంట చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకూ కిలో ఇరవై రూపాయలు పలికిన టమాటా ధర నేడు కిలో యాభై నుంచి అరవై రూపాయలకు చేరుకోవడంతో కొనుగోలు చేయడానికి కూడా జంకుతున్నారు. కూరగాయల ధరలన్నీ పెరిగిపోయాయి. సాధారణంగా ఎండా కాలంలో కూరగాయల ధరలు పెరుగుతాయి. కానీ వర్షాకాలంలోనూ కూరగాయలు ధరలు పెరగడం దిగుమతులు తగ్గడమేనని వ్యాపారులు చెబుతున్నారు. దిగుబడులు కూడా తగ్గడం కూడా ధరలు పెరగడానికి మరొక కారణంగా వ్యాపారులు చెబుతుండటం విశేషం. తుపానులు, విపరీతమైన చలితీవ్రత కారణంగా దిగుబడులు తగ్గాయంటున్నారు.
అన్ని కూరగాయల ధరలు కూడా...
ఆకుకూరలు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. నీటి ఎద్దడితో పంట చేతికి రాకపోవడంతో ఆకు కూరల ధరలు కూడా పెరిగిపోయాయి. మిర్చి కిలో ధర ఎనభై దాటేసింది. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట కూడా అందకుండా పోవడంతో దిగుబడులు తగ్గిపోయాయని అంటున్నారు. దాదాపు అన్ని కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. టమాటా, మిర్చి, క్యాబేజీ, ఆలుగడ్డ, వంకాయ వంటి కూరగాయలు ధరలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పావు కిలో కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు.