YSRCP : ఉత్తరాంధ్రలో వైసీపీకి ఊతం చిక్కినట్లేనా? ఇక ఉద్యమానికి సిద్ధమవుతుందా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై వైసీపీ పోరుకుసిద్ధమవుతుంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై వైసీపీ పోరుకుసిద్ధమవుతుంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సెంటిమెంట్ గా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను దశలవారీగా ప్రయివేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుందన్న కార్మిక సంఘాలకు వైసీపీ అండగా నిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, విశాఖ కార్పొరేటర్లతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ ఉద్యమంలో కలసి రావాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపు నిచ్చారు.
బలహీనంగా ఉండటంతో...
ఉత్తరాంధ్రలో వైసీపీ బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీని ప్రజలు ఆదరించలేదు. జిల్లాలకు జిల్లాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను తమ భుజానకెత్తుకునేందుకు ఫ్యాన్ పార్టీ సిద్ధమయింది. ఇప్పటికే నిన్న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు వత్తిడి తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి రాష్ట్రప్రభుత్వానికి పంపారు. దాదాపు 32 డిపార్ట్ మెంట్లలో ఉద్యోగులను తొలగిస్తున్నందున పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. దశలవారీగా ఈ పోరాటాన్ని ప్రారంభించాలని వైసీపీ నాయకత్వం కూడా నిర్ణయించింది.
రాజకీయ పార్టీలతో కలిసి...
వామపక్ష పార్టీలతో పాటు ఇతరగా కలసి వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ఉత్తరాంధ్రలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించాలన్న యోచనలో వైసీపీ ఉంది. ముందుగా స్థానిక నాయకత్వంతో కలసి పోరాటం చేయడంతో పాటు కార్మిక సంఘాలను అవసరమైతే ఢిల్లీకి తీసుకెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు మద్దతుగా త్వరలోనే విశాఖకు వచ్చేందుకు కూడా పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం మీద ఉత్తరాంధ్రలో తిరిగి నిలదొక్కుకునేందుకు వైసీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను ఆయుధంగా మలుచుకుంటుంది. మరి ఈ ఉద్యమం వైసీపీకి ఎంత మేరకు లాభిస్తుందన్నది చూడాలి.