Yoga Day Celebrations : 'యోగాంధ్ర' సూపర్ సక్సెస్.. ఫిదా అయిన మోదీ
విశాఖలో ఈరోజు జరిగిన 'యోగాంధ్ర' కార్యక్రమం విజయవంతమయింది.
విశాఖలో ఈరోజు జరిగిన 'యోగాంధ్ర' కార్యక్రమం విజయవంతమయింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు హాజరు కావడంతో విశాఖలో ఈరోజు జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ సక్సెస్ అయిందనే అనాలి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ ఐదు లక్షల మంది యోగా చేయడానికి ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు సక్సెస్ అయ్యాయి. ప్రపంచ రికార్డును అధిగమించాలన్న చంద్రబాబు లక్ష్యం నెరవేరిందనే చెప్పాలి. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 34 కిలోమీటర్ల మేర కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం ప్రభుత్వం 62 కోట్ల రూపాయలను వెచ్చించింది. వర్షం వస్తే ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం సిద్ధం చేసింది.
మంత్రుల బృందం అక్కడే ఉండి...
ఈ మెగా ఈవెంట్ కోసం కొద్ది రోజుల నుంచి మంత్రుల బృందం అక్కడే ఉంది. విశాఖ ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు సుమారు 34 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని యోగా వేదికగా తీర్చిదిద్దారు. బీచ్ రోడ్డులో మొత్తం 326 కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి 40 అడుగులకు ఒక చిన్న వేదికను నిర్మించారు. ఈ ఏర్పాట్ల కోసం బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కార్యక్రమంలో పాల్గొనేవారికి ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం కల్పించారు. ప్రతిఒక్కరికీ ఉచితంగా యోగా మ్యాట్, టీ షర్టులు అందజేశారు. యోగా కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం వేల తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఐదు కంపార్ట్‌మెంట్‌లకు ఒక వైద్య శిబిరాన్ని, ప్రధాన వేదిక వద్ద పది పడకల తాత్కాలిక ఆసుపత్రిని సిద్ధం చేశారు. ప్రజల తరలింపు కోసం 3,600 ఆర్టీసీ బస్సులతో పాటు 7,295 ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశారు.
ఏపీవైపు ప్రపంచం చూపు...
ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. , బీచ్ రోడ్డు వెంబడి 2 వేల సీసీ కెమెరాలను అమర్చారు. కార్యక్రమ పర్యవేక్షణకు 26 మంది ప్రముఖ యోగా గురువులు, 1500 మంది శిక్షకులు, 6300 మంది వాలంటీర్లు సేవలందించారు. తూర్పు నౌకాదళం కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటోంది. వారి ఆధ్వర్యంలో 11 యుద్ధ నౌకలపై యోగా సాధన చేశారు. ఈ అపూర్వ ఘట్టం ద్వారా యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఏర్పాట్లను ఘనంగా చేశారు. విశాఖలో ఏర్పాట్లను చూసి మోదీ కూడా ఫిదాఅయ్యారు. అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమయిందని, అపూర్వ ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా మారిందని మోదీ అనడంతో కూటమి నాయకుల్లో ఉత్సాహం నిండింది. ఈ ఈవెంట్ ద్వారా ఏపీ వైపు ప్రపంచంచూసేలా చేశామని చంద్రబాబు అన్నారు.