Visakha : విశాఖ భూ పందేరం.. కూటమికి తలనొప్పిగా మారనుందా?
విశాఖలోని గీతం యూనివర్సిటీ భూముల వివాదం కూటమి సర్కార్ ను ఇరుకున పెట్టేలా కనపడుతుంది.
విశాఖలోని గీతం యూనివర్సిటీ భూముల వివాదం కూటమి సర్కార్ ను ఇరుకున పెట్టేలా కనపడుతుంది. దాదాపు యాభై ఎకరాల భూమిని గీతం విద్యాసంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించడం వివాదంగా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో భూముల క్రమబద్దీకరణకు ఆమోదం తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయల విలువైన యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం విద్యాసంస్థలకు ఎలా కట్టబెడతారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా తమ కుటుంబ సభ్యులకు విశాఖ భూములను ధారాదత్తం చేయడం అలవాటుగా మారిందని వైసీపీ నేతలు బహిరంగంగానే అంటున్నారు.
గతంలోనూ అప్పగించారని...
గతంలో చంద్రబాబు హయాంలోనే గీతం విద్యాసంస్థలకు 70 ఎకరాల ప్రభుత్వ భూములను గీతం విద్యాసంస్థలకు అప్పగించారని, ఇప్పుడు యాభై ఎకరాలను అప్పగించారని చెబుతున్నారు. మొత్తం 120 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇలా ఒక విద్యాసంస్థకు అప్పగించడమేంటని వైసీపీ ఉత్తరాంధ్రలో ఆందోళనలకు దిగుతుంది. ఒకరకంగా ఉత్తరాంధ్ర లో కూటమి ప్రభుత్వానికి గీతం భూముల వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. గతంలోనూ దస్ పల్లా భూములు, హయగ్రీవా భూముల విషయంలో వైసీపీ ఇదే రకమైన ఆరోపణలు ఎదుర్కొని గత ఎన్నికల్లో రాజకీయ ఇబ్బందులు పడిన విషయాలను కొందరు గుర్తు చేస్తున్నారు.
రాజకీయంగా...
మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఇప్పటికే గీతం భూముల అప్పగింతపై పర్యావరణ శాఖతో పాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అలాగే కమ్యునిస్టులు కూడా గీతం భూములకు భూపంపిణీ వ్యవహారంపై ఆందోళన చేస్తున్నారు. ఇలా కూటమి ప్రభుత్వానికి గీతం భూముల పంపిణీ ఇబ్బందికరంగా మారుతున్న తరుణంలో పార్లమెంటు సభ్యుడు, గీతం విద్యాసంస్థల అధినేత శ్రీభరత్ మాత్రం ఆ భూముల విలువ కేవలం వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమేనని, తాము కరోనా సమయంలోనూ అనేక మందిని ఆదుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. తమది సేవాసంస్థ అని ఆయన చెబుతున్నారు. ఎవరెన్ని చెప్పినప్పటికీ గీతం వ్యవహారం కూటమి ప్రభుత్వానికి మాత్రం రాజకీయ ఇబ్బందులను తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం ఈ ఆందోళనలతో కొంత డైలామాలో పడినట్లు తెలిసింది.