సంచలనం రేపుతున్న శశికళ వీడియో

Update: 2017-08-21 06:30 GMT

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళకు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. శశికళ పరప్పణ అగ్రహార జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నట్లు గతంలో జైళ్ల శాఖ అధికారి రూప బయటపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా రూప తాజాగా దర్యాప్తు సంస్థకు అందజేశారు. కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఈ కేసులో శశికళకు జైలులో రాజభోగాలు అందడమే కాదు... శశికళ జైలు నుంచి నింపాదిగా బయటకు వెళ్లివస్తున్నట్లు కూడా బయటపడింది. శశికళ, ఆమె వదిన ఇళవరసి ఇద్దరూ జైలు బయట నుంచి లోపలికి వస్తున్న వీడియో ఫుటేజీని రూప దర్యాప్తు సంస్థ అధికారులకు అందజేశారు. ఈ వీడియోలో శశికళ చుడీదార్ ధరించి ఖరీదైన బ్యాగ్ ను చేతిలో పట్టుకుని జైలు బయట నుంచి వస్తున్నట్లు కన్పిస్తోంది. ఆమె వదిన ఇళవరసి మాత్రం చీరలోనే సాదాసీదాగా కన్పించారు. గతంలో లీకయిన వీడియోల్లోనూ శశికళ ఖరీదైన దుస్తుల్లోనే కన్పించారు.

జైలు నుంచి బయటకు ఎక్కడకు వెళ్లారు?

అయితే అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళను అసలు బయటకు ఎలా పంపారు? ఆమె బయటకు ఎక్కడకు వెళ్లారు. జైలులో ఉండకుండా బయట వేరే ఇంటికి వెళ్లి రాజకీయాలు నెరుపుతున్నారా? తన కుటుంబ సభ్యులను, సన్నిహితులను కలుసుకుంటున్నారా? ఇదేచర్చ ఇప్పుడు కర్ణాటక,తమిళనాడులోనూ జరుగుతోంది. శశికళకు జైలులో అన్ని సౌకర్యాలనూ కల్పించడానికి దాదాపు రెండు కోట్ల రూపాయలను జైలు అధికారులకు ఇచ్చినట్లు గతంలో ఆరోపణలు చేశారు జైళ్లశాఖ అధికారి రూప. వెంటనే ఆమెను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసింది ప్రభుత్వం. అయితే రూప తాజాగా బయట పెట్టిన వీడియో ఫుటేజీ చూసిన వారికి రెండు కోట్లు ఏం ఖర్మ ఇంకా ఎక్కువే ముడుపులు అందుకుని ఉంటారంటున్నారు. ఎందుకంటే శశికళ జైలు దుస్తులు కాకుండా సాధారణ దుస్తుల్లో బయటకు వెళ్లడం సంచలనమే.

Similar News