బైరెడ్డి ఊసే లేదే?

Update: 2017-11-01 10:30 GMT

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. కర్నూలు జిల్లాలో పేరున్న నేత. రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి ఇటీవలే దాన్ని మూసేశారు కూడా. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరతారని రెండు నెలల క్రితమే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నిక అనంతరం ఆయన టీడీపీలో చేరుతున్నట్లు టీడీపీ నేతలు కూడా అంగీకరించారు. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా బైరెడ్డి వస్తే తనకెలాంటి అభ్యంతరం ఉండబోదని చెప్పేశారు. కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన చంద్రబాబు పర్యటనలో బైరెడ్డి పార్టీ లో చేరతారని చెప్పారు. కాని చేరలేదు. అయితే బైరెడ్డి రాకను టీడీపీలోనే అనేక మంది నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. బైరెడ్డి విధించిన షరతులు కూడా టీడీపీ అధినేత ను ఒప్పించలేకపోయాయంటున్నారు.

ఎందుకు చేరలేదబ్బా....?

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తొలి నుంచి టీడీపీలోనే ఉన్నారు. అయితే రాష్ట్ర్ర విభజనకు ముందు ఆయన టీడీపీని వీడారు. రాయలసీమ వాదాన్ని భుజానకెత్తుకున్నారు. గత నెలలో కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు సమక్షంలోనే ఆయన టీడీపీలో చేరాల్సింది. కాని చంద్రబాబు సభ వద్దకు కూడా బైరెడ్డి రాలేదు. అయితే అమరావతికి తన అనుచరులతో వెళ్లి చేరతారని ఆయన అనుచరులు చెప్పారు. ఆయన సొంత గ్రామమైన ముచ్చుమర్రిలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందించుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో బైరెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట అభ్యర్థిని కూడా బరిలోకి దించారు. కాని మూడెంకెల ఓట్లు మాత్రమే రావడంతో బైరెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. రాయలసీమ వాదం లేదని భావించిన బైరెడ్డి టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే కర్నూలు జిల్లా నేతలు బైరెడ్డి రాకకు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు శిల్పా చక్రపాణిరెడ్డి ఖాళీ చేసిన ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని బైరెడ్డి కోరగా అందుకు చంద్రబాబు ఒప్పుకోలేదని సమాచారం. నందికొట్కూర్ టిక్కెట్ పై కూడా చంద్రబాబు హామీ ఇవ్వలేదు. అక్కడ ఇప్పటికే ఇన్ ఛార్జిగా శివానందరెడ్డి ఉన్నారు. దీంతో బైరెడ్డి పునరాలోచనలో పడ్డారు.మొత్తం మీద బైరెడ్డి చేరికపై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది.

Similar News