డామిట్...గడ్డం కథ అడ్డం తిరిగిందే...?

Update: 2017-02-19 00:30 GMT

గడ్డం మీసాలు పెంచితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? ఈ ప్రశ్న వేసింది ఎవరో కాదు. సొంత పార్టీ...పీసీసీ అధ్యక్షుడు సొంత జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల సర్వే చేయించారు. ఈ సర్వేలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తేలిందట. దీంతో ఆయన తాను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకూ గడ్డం తీయబోనని శపథం కూడా చేశారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు గాంధీభవన్ లో ప్రకంపనలు రేపాయి.

ఉత్తమ్ పై కోమటిరెడ్డి ఫైర్...

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? రాదా? అని పక్కన బెడితే...ఉత్తమ్ చేసిన శపథం ఒకింత కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతుంది. అంతేకాకుండా సర్వే రిపోర్ట్ లు కూడా బయటపెడితే నేతలు కూడా ఉత్సాహంగా ప్రభుత్వ వ్యతిరేకంగా చేపట్టే ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటారని ఉత్తమ్ భావించి ఉండవచ్చు. ఇదే సర్వేలో నల్లగొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో పది స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కూడా చెప్పారు. కాని ఉత్తమ్ వ్యాఖ్యలను సొంతపార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించడం గమనార్హం. గడ్డం, మీసాలు పెంచినంత మాత్రాన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంతపార్టీ నేతలే తప్పుపడతున్నారు. ఆయన అధికారపార్టీకి అనుకూలంగా కామెంట్లు చేసినట్లేనని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

కోమటిరెడ్డి ఆగ్రహానికి కారణాలివే...

ఇంతకూ ఉత్తమ్ బయటపెట్టిన సర్వే రిపోర్ట్ కోమటిరెడ్డి ఆగ్రహానికి ఎందుకు కారణమయింది? ఎందుకంటే పార్టీ నేతలు అందించిన సమాచారం ప్రకారం...కోమటిరెడ్డి బ్రదర్స్ పీసీసీ పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారట. అయితే ఉత్తమ్ ఇందుకు అడ్డుగా ఉన్నారు. ఉత్తమ్ సొంతంగా సర్వే చేయించడం...అది హైకమాండ్ కు పంపడంతో కోమటిరెడ్డి ఆగ్రహానికి కారణమైందని చెబుతున్నారు. 2019 వరకూ ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారని కలలు కంటున్నారని కూడా వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. బోగస్ సర్వే లు చేయించి హైకమాండ్ మెప్పుపొందుదామని ఉత్తమ్ భావిస్తున్నారని ఆరోపించారు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ కష్టపడి తెలంగాణలో 80 స్థానాలు గెలిచేలా కృషి చేస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఉత్తమ్ చేయించిన సర్వేలో నకిరేకల్, భువనగిరిలో కాంగ్రెస్ కష్టంగా ఉన్నట్లు తేలిందట. ఈవిషయాన్ని ఉత్తమ్ బయటకు చెప్పేశారు. నకిరేకల్ లో కోమటిరెడ్డి అనుచరుడు చిరుమర్తి లింగయ్య 2009 నుంచి2014 వరకూ శాసనసభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గానికి లింగయ్య ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. భువనగిరిలో కూడా కోమటిరెడ్డి సన్నిహితుడు పోతంశెట్టి వెంకటేశ్వర్లు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తన అనుచరులు కాబట్టే ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవదని ఉత్తమ్ తప్పుడు సర్వే రిపోర్ట్ లు ఇచ్చారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారని తెలుస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ లో ఒక సామెత ఉంది. కాంగ్రెస్ కు బయట నుంచి ఎవరూ శత్రువులు ఉండరట. లోపలే ఉంటారన్న సామెతను కోమటిరెడ్డి మరోసారి రుజువు చేసినట్లయిందంటున్నారు పార్టీ సీనియర్ నేతలు.

Similar News