జయ కేసుతో కర్ణాటక సర్కారు ఖజానాకు చిల్లు

Update: 2017-02-20 06:20 GMT

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు మూటగట్టుకున్న కేసు విచారణకు అక్షరాలా 2.36కోట్ల రుపాయలు ఖర్చు అయ్యింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ల కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం రూ.2.36 కోట్లు ఖర్చు చేసింది. తమిళనాడునుంచి ఈ కేసు కర్ణాటకకు 2004లో బదిలీ అయ్యింది. 2004 నుంచి 2014 వరకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు, ఇతరత్రా అవసరాలకు కర్ణాటక ప్రభుత్వం రూ.3.93 కోట్లను విడుదల చేయగా రూ.2.36 కోట్లు ఖర్చయ్యాయని సహ కార్యకర్త ఒకరి అర్జీతో ఈ గణాంకాలు వెలుగుచూశాయి.

తమిళనాడే భరించాలి....

ఖర్చులకు విడుదల చేసిన మొత్తంలో మిగులు నిధులను న్యాయ, హోంశాఖలు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేశాయి. ప్రత్యేక న్యాయస్థానం వద్ద పోలీసు భద్రత, జయలలిత, ఇతర నిందితులు వచ్చి వెళ్లినప్పుడు ఏర్పాటు చేసిన ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, అధికారులు, సిబ్బంది వేతనాలు, ఇతర భత్యాల రూపంలో రూ.90.13 లక్షలను చెల్లించారు.ఈ మొత్తం ఖర్చును తమిళనాడు ప్రభుత్వం చెల్లించాలని ఇటీవలే కర్ణాటక లేఖ కూడా రాసింది. ఇప్పుడు శశికళ అండ్ కో ఖర్చును కూడా కర్ణాటక ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. కేసు విచారణ బాధ్యతలు చేపట్టిన కర్ణాటక విజ్ఞప్తికి పళనిస్వామి సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Similar News