గుజరాత్ ఓటర్లు మోడీ వైపా? రాహుల్ సైడా?

Update: 2017-10-30 16:32 GMT

ప్రజాస్వామ్యం అంటేనే నిత్య పరీక్ష. ప్రజలను సంతృప్తి పరుస్తూ వారి సమ్మతిని పొందడం, పీఠాన్ని కాపాడుకోవడం మామూలు విషయం కాదు. సామదానభేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తే తప్ప ఫలితం దక్కదు. అందుకే అధికారానికి అడ్డదారులు వెదుకుతుంటారు. కొత్త సమీకరణలు, ఎత్తులు, పొత్తులతో ప్రజాభిప్రాయాన్ని సానుకూలం చేసుకునే వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలవుతుంటారు. తమ సొంతబలం కంటే ఎదుటి వారి బలహీనతలే ప్రధానాస్త్రంగా ఎన్నికల రణరంగంలో గెలుపు సాధించాలని చూస్తున్నాయి గుజరాత్ లోని ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెసు . రెండు జాతీయ పార్టీలు ముఖాముఖి తలపడుతున్న దేశంలోని అతికొద్ది రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. గడచిన రెండు దశాబ్దాలుగా కమలనాథులదే ఇక్కడ హవా. బీజేపీకి అగ్నిపరీక్షగా, రాహుల్ నాయకత్వ సామర్థ్యానికి సవాల్ గా పరిణమించిన గుజరాత్ ఓటరు తీర్పు దేశరాజకీయాల్లో పెనుమార్పునకు సంకేతంగా కూడా పరిశీలకులు భావిస్తున్నారు.

సొంత రాష్ట్రమే సరికొత్త సవాల్...

2014 ఎన్నికల తర్వాత మూడు సందర్భాల్లో మోడీ ప్రజాదరణకు సంబంధించి పరీక్షను ఎదుర్కొన్నారు. బీహార్, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఎన్నికలను రాజకీయ సమీకరణల దృష్ట్యా గతంలో ప్రతిష్టాత్మకంగా భావించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ విజయం, బీహార్ లో మహాఘట్ బంధన్ సంకీర్ణం మోడీకి రాజకీయంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించింది. కానీ నోట్ల రద్దు తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నిక పునరుత్తేజాన్ని నింపింది. లోక్ సభలో ఏడోవంతు సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీ విజయం కాంగ్రెసు ఆశలను కల్లలు చేసింది. అధికార సమాజ్ వాదీతో జోడీకట్టినా కనీస స్థానాలు కూడా గల్లంతయ్యాయి. దీంతో 2019లో మోడీదే అధికారం అని విపక్షాలు సైతం ఫిక్స్ అయిపోయాయి. మళ్లీ తాజాగా గుజరాత్ మోడీ నాయకత్వానికి కొత్త సవాల్ విసురుతోంది. జీఎస్టీ అమలు తర్వాత వ్యాపార వర్గాలకు నిలయమైన గుజరాత్ లో తొలి ప్రజాస్పందన వెలువడ బోతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలను బుల్ డోజ్ చేసి తన విధానాలను ఏకపక్షంగా అమలు చేయడంలో మోడీ ఘనాపాటి. కానీ సొంతరాష్ట్రంలో తీర్పుభిన్నంగా వస్తే కచ్చితంగా జాతీయ స్థాయిలో మోడీ ఇరుకున పడతారు. ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రం దొరుకుతుంది. నిజానికి గుజరాత్ రాజకీయంగా అంత ప్రాధాన్యమున్న రాష్ట్రం కాదు. 26 లోక్ సభ స్థానాలతో కూడిన ఒక మోస్తరు రాష్ట్రం. మోడీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అప్రతిహత విజయాలు సాధించడం మొదలు పెట్టిన తర్వాతనే కీలకంగా మారింది. బీజేపీ ప్రయోగాలకు వేదికగా గుజరాత్ ను తీర్చిదిద్దారు. మోడీ విధానాలకు, జీఎస్టీకి ప్రజానీకం ఆమోదం ఉందని నిరూపించుకోవాలంటే బీజేపీకి ఈ విజయం తప్పనిసరి.

సామాజిక సమీకరణలే సమస్తం...

‘ హు వికాస్ చు, హు చు గుజరాత్ ‘ అనేది రాష్ట్రప్రభుత్వ అధికారిక నినాదం. నేను అభివృద్ధిని. నేను గుజరాత్ ను అనేది దీనర్థం. అంటే అభివృద్ధిని, రాష్ట్రాన్ని విడదీసి చూడలేమన్నదే భావన. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. ఇతర రాష్టాల తరహాలోనే సామాజిక సమీకరణలు చాలా కీలకంగా ఉంటున్నాయి. ఈ విడత మరింత ఎక్కువగా ఆయా సామాజిక వర్గాలు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. ఈ రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల వారు ఎనిమిది శాతం, వెనుకబడినతరగతుల వారు మొత్తంగా 40 శాతం, షెడ్యూల్డు తెగల వారు 15శాతం, ముస్లిం లు 9 శాతం, పటేదార్లు 12 నుంచి 13 శాతం వరకూ ఉన్నారు. వివిధ ప్రాజెక్టుల కారణంగా ఎస్టీలు ఎక్కువగా నిర్వాసితులయ్యారు. మత తత్వ దాడులకు ఎస్సీలు గురయ్యారు. రిజర్వేషన్ లేక పటేదార్లు ఆగ్రహం చెందారు. ఎలాగూ ముస్లిం లకు బీజేపీ అంటే పడదు. ఇలా వివిధ సమీకరణలతో కాంగ్రెసు ఆయా వర్గాలకు గాలం వేస్తోంది. కాంగ్రెసు తన కిట్టీలో ఇప్పటికే 40 శాతం ఓటర్లకు ప్రాతినిధ్యం వహించే భిన్నసామాజిక శక్తులు చేరిపోయాయని భావిస్తోంది. హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవాని రూపంలో పటేదార్, బీసీ, ఎస్సీ వర్గాలపైనే ఆ పార్టీ గురిపెట్టింది. ఆశలూ పెట్టుకుంది.

బీజేపీ చీలికల వ్యూహం...

బలమైన మూడు శక్తులు కాంగ్రెసుకు అండగా నిలుస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా విపక్ష అనైక్యతా సూత్రాన్ని ప్రయోగించబోతోంది బీజేపీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికే తమకు కలిసి వస్తుందని ఆశలు పెట్టుకుంటోంది. కాంగ్రెసుకు ప్రతిగా అవసరమైతే ఆయా వర్గాలకు పరోక్షంగా సహకారం అందించేందుకూ సిద్ధమవుతోంది. బీజేపీ, కాంగ్రెసుతో తీవ్రంగా విభేదించే శక్తులు ఈసారి రాష్ట్రంలో బరిలోకి దిగుతున్నాయి. అవి బలం పుంజుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. తద్వారా తాము సులభంగా గట్టెక్కుతామని అధికార పార్టీ అంచనా వేసుకుంటోంది. 2012 లో కూడా ఇలాగే జరిగింది. కేశూభాయ్ పటేల్ నేత్రుత్వంలోని గుజరాత్ పరివర్తన్ పార్టీ బీజేపీ వ్యతిరేక ఓటును కొంతమేరకు చీల్చగలిగింది. ఇప్పుడు కాంగ్రెసు నుంచి విడివడిన శంకర్ సింఘ్ వాఘేలా నేతృత్వంలోని జనవికల్ప్ పార్టీ ఇప్పటి ఎన్నికల్లో అదే పాత్ర పోషిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. గతంలో కాంగ్రెసుతో కలిసి పోటీచేసిన శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్ సీ పీ ఈ సారి ఒంటరిగా బరిలోకి దిగనుంది. ఈ పార్టీ పటేల్ ప్రాబల్య నియోజకవర్గాల్లోని ఓట్లను చీలుస్తుందని కమలనాథులు కొండంత నమ్మకం పెట్టుకుంటున్నారు. ఆమ్ ఆద్మీపార్టీ కూడా గుజరాత్ లో రంగంలోకి దిగుతోంది.బీజేపీ, కాంగ్రెసు లకు సమదూరం పాటించే ఆప్ కారణంగా అర్బన్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. యూత్ కూడా ఆప్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాంగ్రెసు పార్టీ ప్రధానంగా హార్దిక్, అల్పేష్, జిగ్నేష్ ల మద్దతుతో రాజకీయ పునరేకీకరణతో రాజ్యాధికారం చేపట్టాలని భావిస్తోంది. ఎన్సీపీ,ఆప్, జేవీపీలు కాంగ్రెసు బలపడకుండా తగు మోతాదులో ఓట్లు చీల్చి బీజేపీ అధికారాన్ని కాపాడతాయని బీజేపీ నమ్ముతోంది. మొత్తమ్మీద రెండు పార్టీలు సొంతబలం కంటే ఇతరులు ఇచ్చే మద్దతు, చీల్చే ఓట్లనే నమ్ముకుంటున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News