కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

Update: 2017-02-13 18:29 GMT

ఈశాన్య భారతంలో మత మార్పిడులపై కాంగ్రెస్‌ చేస్తోన్న ఆరోపణలకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తిప్పి కొట్టారు. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హిందూ రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందన్న కాంగ్రెస్‌ ఆరోపణలపై కిరణ్‌రిజిజు ఘాటుగా స్పందించారు. భారత్‌లో ‘హిందువుల జనాభా దేశంలో తగ్గిపోతోంది. ఎందుకంటే హిందువులు ఎన్నడు ఇతరుల్ని తమ మతంలోకి మార్చుకోకపోవడమే కారణమని ట్విటర్‌లో పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చేసిన ఆరోపణలకు సంబంధించిన ప్రకటనను జోడిస్తూ.., ఆయన పలు ట్వీట్లు చేశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుందన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన కిరణ్‌రిజిజు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నారు.

అన్ని మతాలవారికీ అవకాశం...

గత ఏడాది కాలంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అసమ్మతివాదులు సీఎంకు సహకరించకపోవడంతో అక్కడ సంక్షోభం నెలకొంది. ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ప్రస్తుతం భాజపా -పీపీఏ కూటమి తరపున డిసెంబర్‌ నుంచి టకం పరియో సీఎంగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం భాజపాయేనని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అలాగే కిరణ్‌ రిజిజు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలో కిరణ్‌రిజిజు స్పందిస్తూ.., కాంగ్రెస్‌ పార్టీ రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని హితవుపలికారు. భారత్‌ సెక్యులర్‌ దేశమని, అన్ని మతాలకు చెందినవారు స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. అంతేకాకుండా అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రజలంతా ఐక్యతతో ప్రశాంతంగా జీవిస్తుంటే.. కాంగ్రెస్‌పార్టీ ఎందుకు బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తోందని ప్రశ్నించారు. నిజానికి అరుణాచల్‌ ప్రదేశ్‌ మొదట్నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ వచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయాయని కాంగ్రెస్‌ అనుమానిస్తోంది.

Similar News