అమిత్ షా మూడేళ్ల పండగలో ఇది భంగపాటు కాదా?

Update: 2017-08-09 05:30 GMT

అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పదవి చేపట్టి నేటికి మూడేళ్లవుతోంది. మూడేళ్లయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవాల్సిన సమయంలో గుజరాత్ లో బీజేపీకి భంగపాటు ఎదురయంది. అహ్మద్ పటేల్ విజయంతో కాంగ్రెస్ లో నూతనోత్సాహం కలిగింది. తీవ్ర ఉత్కంఠ నడుము జరిగిన ఎన్నికల్లో అహ్మద్ పటేల్ నే విజయం వరించింది. గత పక్షం రోజులుగా గుజరాత్ లో షా ఆడిన డ్రామాకు కాంగ్రెస్ శుభం కార్డు వేసేసింది. వాస్తవానికి గుజరాత్ అసెంబ్లీలో ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకునే బలం కాంగ్రెస్ కు ఉంది. అందుకోసమే నాలుగుసార్లు ఎన్నికైన అహ్మద్ పటేల్ నే ఐదోసారి అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం బరిలోకి దింపింది. అయితే ఎన్నికలకు ముందే ఆ పార్టీ సీనియర్ నేత శంకర్ సింగ్ వాఘేలా షాక్ ఇచ్చారు. ఆయన పార్టీ నుంచి బయటకు రావడం వెనక కూడా బీజేపీ వ్యూహం ఉందని కాంగ్రెస్ అనుమానించింది. కాంగ్రెస్ అనుమానించినట్లుగానే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడిపోయారు.

చావు దెబ్బకొట్టాలని.... తానే భంగపడి.......

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన బల్వంత్ సింగ్ రాజ్ పుత్ నే రాజ్యసభ మూడో అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దించింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 కోట్లు ఇవ్వడానికి బీజేపీ సిద్ధమయిందని కాంగ్రెస్ ఆరోపించింది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. కాంగ్రెస్ కు సంబంధించిన 44 మంది ఎమ్మెల్యేలను క్యాంప్ కు తరలించింది. చివరి నిమిషం వరకూ పట్టుజారిపోకుండా చూసుకుంది. అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. తాము ఓటు వేసినట్లు అమిత్ షాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూపించడాన్ని ఆ పార్టీ తనకు అవకాశంగా మలచుకుంది. ఆ రెండు ఓట్లు చెల్లవని ఈసీ ఎదుట వాదించింది. సోనియా వెంటనే సీనియర్ నేతలతో మాట్లాడి మూడు సార్లు ఎన్నికల కమిషన్ వద్దకు పంపారు. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం నేతృత్వంలో ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ తాను అనుకున్నది సాధించింది. ఒక విధంగా అహ్మద్ పటేల్ గెలుపు కాంగ్రెస్ కు భారీ విజయమనే చెప్పొచ్చు. బీజేపీకి అవలంబిస్తున్న విధానాలకు సరైన శాస్తి జరిగిందన్నది పార్టీ నేతల అభిప్రాయం కూడా. అమిత్ షా మూడేళ్ల పదవీ బాధ్యతల సంబరాలు చేసుకునే సమయంలోనే గుజరాత్ ఓటమి ఆయనతో పాటు పార్టీకి ఇబ్బందనే చెప్పాలి. ఈ ఓటమితోనైనా బీజేపీ నియంత పోకడలకు స్వస్తి చెబుతుందని విపక్షాలే కాదు స్వపక్ష నేతలూ ఆశిస్తున్నారు.

Similar News