ఇప్పుడు.. ఏం చేద్దాం.. వైసీపీ అంత‌ర్మథ‌నం

ఇప్పుడు ఏం చేద్దాం.. ఎలా ముందుకు సాగుదాం.. ఇదీ.. ఇప్పుడు వైసీపీని కుదిపేస్తున్న ప్రశ్న. ఇప్పటికే ప్రతిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శలు ఎదుర‌వుతున్నాయి. అదే స‌మ‌యంలో ప్రజ‌లు [more]

Update: 2021-08-16 11:00 GMT

ఇప్పుడు ఏం చేద్దాం.. ఎలా ముందుకు సాగుదాం.. ఇదీ.. ఇప్పుడు వైసీపీని కుదిపేస్తున్న ప్రశ్న. ఇప్పటికే ప్రతిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శలు ఎదుర‌వుతున్నాయి. అదే స‌మ‌యంలో ప్రజ‌లు కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గానే తీసుకుంటున్నారు. దీంతో ఇప్పు డు ఏం చేయాల‌నే విష‌యంపై వైసీపీ నాయ‌కులు దృష్టి పెట్టారు.. విష‌యంలోకి వెళ్తే.. విశాఖ ఉక్కు ప‌రిశ్రమ‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ముందుకే సాగుతాన‌ని క‌రాఖండీగా ప్రక‌టించింది. ఈ విష‌యంలో ఎవ‌రి జోక్యాన్ని స‌హించేది లేదని కూడా తేల్చి చెప్పింది. పైగా సుప్రీం కోర్టు తీర్పులు కూడా త‌మ‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని కేంద్రం స్పందించేసింది. ఈ క్రమంలో ఇక‌, విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించ‌కుండా ఆపేదెలా? అన్న ప్రశ్న వైసీపీని త‌ర్జన భ‌ర్జన‌కు గురి చేస్తోంది.

రాజీనామా కు రెడీగా…

ఇక‌, ఈ విష‌యంలో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ చాలా దూకుడుగా ఉంది. త‌మ‌కు ఉన్న ముగ్గురు ఎంపీల‌తోనూ రాజీనామా చేయిస్తామ‌ని.. చంద్రబాబు ఇప్పటికే ప్రక‌టించారు. ఇక‌, ఇప్పుడు కేంద్రం కోర్టుకు కూడా అస‌లు విష‌యం చెప్పేసిన త‌ర్వాత‌.. టీడీపీ త‌ర‌ఫున ఉద్యమానికి కూడా రెడీ అయ్యారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు రాజీనామా చేశారు. మ‌రోవైపు విశాఖలో ఉద్యమాన్ని తీవ్రత‌రం చేసేందుకు నాయ‌కులు రెడీ అవుతున్నారు. ఈ స‌మ‌యంలో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎంపీలతో రాజీనామాలు చేయించ‌డ‌మా? అలా చేయిస్తే.. కేంద్రానికి నొప్పి త‌గులుతుందా? విశాఖ ఉక్కు నిలిచిపోతుందా? అనే ఆలోచ‌న వైసీపీని కుదిపేస్తోంది.

వైసీపీ మాత్రం….

అదే స‌మ‌యంలో.. నిమ్మకునీరెత్తిన‌ట్టు ఉంటే.. ఏం జ‌రిగితే అదే జ‌రుగుతుంద‌ని చూస్తూ కూర్చుంటే.. ఏం జ‌రుగుతుంది? ఇప్పటికే సీఎం జ‌గ‌న్ రెండు సార్లు కేంద్రానికి లేఖ‌లు రాశారు క‌నుక‌.. తాము త‌మ‌ ప్రయ‌త్నం విర‌మించ‌లేద‌ని.. ప్రజ‌ల్లోకి వెళ్లే ప్రయ‌త్నం చేస్తే.. స‌క్సెస్ అవుతుందా? ఇదీ ఇప్పుడు వైసీపీ ముందున్న ప్రధాన ప్రశ్న. మ‌రోవైపు.. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా ప్రక‌టించాల‌ని భావిస్తున్న స‌మ‌యంలో ఇక్కడి కీల‌క సంస్థను నిల‌బెట్టుకోలేక పోతే.. టీడీపీ నుంచి ఎదుర‌య్యే ప్రశ్నల‌కు స‌మాధానం చెప్పలేక‌పోవ‌డ‌మే.. కాదు.. విశాఖ ప్రజ‌ల‌కు ఎలా స‌మాధానం చెప్పాల‌నేది కూడా కీల‌కంగా మారింది.

రెండున్నరేళ్లలో ఎన్నికలు…..

మ‌రో రెండున్నరేళ్లలో ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున ఎలాంటి చ‌ర్యలు తీసుకోవాల‌నే విష‌యం ఇటు సీఎం జ‌గ‌న్‌ను అటు.. ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న విజ‌యసాయిరెడ్డిని కూడా తీవ్రంగా క‌ల‌చి వేస్తున్న ప్రశ్నలుగా ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News