Ys jagan : జగన్ తస్మాత్ జాగ్రత్త .. జారిపోతావేమో?

అన్ని ఎన్నికలు గెలవవచ్చు. సంక్షేమ పథకాలు విజయానికి దోహదపడి ఉండవచ్చు. కానీ ఆ ఎన్నికలు మాదిరి సార్వత్రిక ఎన్నికలు ఉండవని గతంలో అనేక ఫలితాలు చెప్పకనే చెప్పాయి. [more]

Update: 2021-10-04 15:30 GMT

అన్ని ఎన్నికలు గెలవవచ్చు. సంక్షేమ పథకాలు విజయానికి దోహదపడి ఉండవచ్చు. కానీ ఆ ఎన్నికలు మాదిరి సార్వత్రిక ఎన్నికలు ఉండవని గతంలో అనేక ఫలితాలు చెప్పకనే చెప్పాయి. జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లే అయింది. అవినీతి మచ్చ లేకుండా పాలనను జగన్ సాగిస్తున్నారు. దీంతో పాటు సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ జగన్ ప్రజలకు చేరువయ్యారు. బలమైన ఓటు బ్యాంకును రూపొందించుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే జగన్ కు పార్టీ నేతల మధ్య విభేదాలు వెనక్కు లాగేలా ఉన్నాయి.

అన్ని ఎన్నికల్లో గెలిచినా….

ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఓటింగ్ శాతం కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే పెరిగింది. కానీ అదే శాతంలో విభేదాలు కూడా పెరిగాయి. ఇదే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. రాజమండ్రి నుంచి సిక్కోలు వరకూ వైసీపీలో నెలకొన్న విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. వీటిని పరిష‌్కరించాలంటే జగన్ నేరుగా రంగంలోకి దిగాల్సిందే. మరో నేత ఎవరూ పూడ్చలేని విధంగా నేతల మధ్య గ్యాప్ ఏర్పడింది.

రచ్చతోటి కార్పొరేషన్….?

రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. వారిద్దరూ ఇక చేతులు కలపడం కష్టంగానే మారింది. వైవీ సుబ్బారెడ్డి రాజీ ప్రయత్నం చేసినా కష్టమేనంటన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు రానున్న రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని ఘోరంగా దెబ్బతీస్తాయని చెప్పక తప్పదు. అక్కడ వైసీపీ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. దీంతో జగన్ నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అనేక నియోజకవర్గాల్లో….

ఇక చీరాలలోనూ వైసీపీ ఇన్ ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ కు, ఎమ్మెల్యే కరణం బలరాం మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఏలూరులో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పూడ్చలేనిది. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య విభేదాలు సమసి పోలేదు. కోడుమూరులో అదే పరిస్థితి. చిలకలూరి పేటలో విడదల రజని, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయల మధ్య పొసగడం లేదు. పొన్నూరులో ఎమ్మెల్యేకు బలమైన నేత రావి వెంకటరమణ దూరమవుతున్నారు. ఈ పరిణామాలను జగన్ గమనించి జాగ్రత్త పడకపోతే వచ్చే ఎన్నికల్లో విభేదాలతోనే అనేక నియోజకవర్గాలను కోల్పోవాల్సి వస్తుంది.

Tags:    

Similar News