జగన్ గెలుపుని ఒప్పుకోవడంలేదే

టీడీపీకి అద్భుతమైన శిక్షణ ఉంటుంది. మిగిలిన పార్టీలకు లేనిది కూడ అదే. అధినాయకుడు చంద్రబాబు ఏం చెబితే అదే కింది స్థాయి టీడీపీ కార్యకర్త కూడా చెబుతారు. [more]

Update: 2019-11-04 13:30 GMT

టీడీపీకి అద్భుతమైన శిక్షణ ఉంటుంది. మిగిలిన పార్టీలకు లేనిది కూడ అదే. అధినాయకుడు చంద్రబాబు ఏం చెబితే అదే కింది స్థాయి టీడీపీ కార్యకర్త కూడా చెబుతారు. అంతే చిత్తశుధ్ధితో జనాలను నమ్మించాలని చూస్తారు. ఎంతో క్రమశిక్షణ పార్టీ అని చెప్పుకునే బీజేపీలో కూడా ఒకే మాట అంతటా ఉండదు. అది ఒక్క చంద్రబాబు టీడీపీకే చెల్లు. బాబు ప్రతి విషయాన్ని తనకు అనుకూలమైన కోణం నుంచి చూస్తారు. ఈ రోజు ఆయన ఓటమిని కూడా అలాగే విశ్లేషించుకున్నారు. తాను ఓడిపోలేదని ఇప్పటికీ బాబు అంటారు. ప్రజలు తప్పు చేశారని కూడా చెబుతారు. మరింతగా ముందుకు వెళ్ళి ఈవీఎంలను మ్యాజిక్ చేసి ఓడించారని కూడా చెబుతారు. బాబు మాటే టీడీపీ తమ్ముళ్ల నోట కూడా వస్తుంది. అది సహజం కూడా.

ఎలాగో గెలిచారట‌…

ఇక టీడీపీ పొలిటి బ్యూరో మెంబర్, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు జగన్ ఎలాగోలా గెలిచినట్లుగా కనిపిస్తోంది. అది ఈవీఎంల మహిమో , మరేంటో తెలియదు కానీ మొత్తానికి గెలిచి సీఎం కుర్చీలోకి ఎక్కావ్ జగన్ అంటూ వెటకారం ఆడారు. లాటరీ కొట్టి ముఖ్యమంత్రి అయినట్లుగా కూడా ఆయన పోల్చుకొచ్చారు. అయినా జగన్ తన పధ్ధతి మార్చుకోవడం లేదని కూడా అయ్యన్న అనడం ద్వారా జగన్ గెలుపుని హేళనే చేశారు. ఎవరూ అనుకోనివిధంగా గెలిచావ్ అంటూ బంపర్ మెజార్టీని కూడా తీసి అవతల పారేశారు.

ప్రజలదీ తప్పుట….

ఇదే సమయంలో ప్రజలదీ తప్పు అంటున్నారు అయ్యన్న. అదే విచిత్రం. ఓ వైపు ఈవీఎంల మాయాజాలంతో జగన్ గెలిచాడని చెబుతున్న అయ్యన్న మరో వైపు ప్రజలు వెళ్ళి ఆయనకే ఓటు చేశారని అని నిందిస్తున్నారు. తప్పు చేసినందుకు ప్రజలు ఇపుడు బాధ పడుతున్నారని అయ్యన్న తెగ ఫీల్ అయిపోతున్నారు. మంచి నాయకులను ఎన్నుకోండి, దొంగలను గద్దెనెక్కిస్తే ఇంతే అంటూ పవన్ లాంగ్ మార్చ్ లో అయ్యన్న మాట్లాడిన మాటలు ఓ విధంగా ప్రజా తీర్పును కించపరచేవే అంటున్నారు.

ప్రజల తీర్పునే…..

ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. వారు ఎవరిని గెలిపించినా తలవంచాల్సిందే కానీ ఇటీవల కాలంలో ప్రజలను కూడా టీడీపీ నిందించడం మొదలైంది. ఇది ప్రజాస్వామ్యానికి దిగాజారుడు కోణంగా చెప్పుకోవాలి. బాబు సైతం ఇలాంటి మాటలు అంటూ ఉంటే టీడీపీ తమ్ముళ్ళు కూడా దీన్నే అనుసరిస్తున్నారు. దేశమంతా ఈవీఎంలు ఒకేలా పనిచేస్తాయి. ఇటీవల మహారాష్ట్రలో, హర్యానాలో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. అంతకు ముందు కర్నాటకలో మెజారిటీ రాలేదు మరి ఈవీఎంల మాయాజాలం అయితే మధ్యప్రదేశ్, రాజష్తాన్ లో బీజేపీ గెలిచేదా. అన్నింటికీ ముందు 2014 లో బాబు సీఎం అయ్యేవాడా. తమ్ముళ్ళే ఆలోచించాలి మరి.

Tags:    

Similar News