ఎన్నికల కోసమని ఫండ్ ఇస్తే…?

అసలే ఓటమితో కుంగిపోయి ఉన్నారు. కానీ ఆధిపత్య పోరు ఏమాత్రం తగ్గలేదు. తెలుగుదేశం పార్టీ నేతలు ఐదేళ్ల పాటు అధికారం కిక్కు ఇంకా దిగనట్లుంది. దారుణంగా ఓటమిపాలయినా [more]

Update: 2019-11-17 06:30 GMT

అసలే ఓటమితో కుంగిపోయి ఉన్నారు. కానీ ఆధిపత్య పోరు ఏమాత్రం తగ్గలేదు. తెలుగుదేశం పార్టీ నేతలు ఐదేళ్ల పాటు అధికారం కిక్కు ఇంకా దిగనట్లుంది. దారుణంగా ఓటమిపాలయినా తమదే పైచేయి కావాలని భావిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ఇదే జరిగింది. అక్కడ టీడీపీ ఇన్ ఛార్జిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఇందుకు కారణం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన నిధులను దుర్వినయోగం చేయడమేనంటున్నారు.

పార్టీ నుంచి బహిష్కరణ…..

వివరాల్లోకి వెళితే… పి. గన్నవరం నియోజకవర్గం లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ నేలపూడి స్టాలిన్ బాబుకు దక్కింది. గతంలో అమలాపురం ఎంపీగా ఉన్న పండుల రవీంద్ర బాబు వద్ద స్టాలిన్ బాబు పీఆర్వో గా పనిచేశారు. అయితే స్టాలిన్ బాబును తీసుకొచ్చి మరీ టీడీపీలో అభ్యర్థిని చేశారు. ఇందుకు కారణం కూడా బలమైనదే. అక్కడ అప్పటికే పులపర్తి నారాయణమూర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయనంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు నామనరాంబాబకు పడదు.

ఒకరికి చెక్ పెట్టడానికి….

అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణమూర్తికి చెక్ పెట్టడానికి నేలపూడి స్టాలిన్ బాబును నామన రాంబాబు, డొక్కా నాథ్ బాబులు తీసుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసి స్టాలిన్ బాబు ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నిధులకు స్టాలిన్ బాబు లెక్క చెప్పలేదని, నిధులను దుర్వినియోగం చేశారని నామన రాంబాబు ఆరోపించి ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయన స్థానంలో మండపాటి కిరణ్ కుమార్ ను నియమించేందుకు రెడీ అయిపోయారు.

నేతలతో పడలేకంటూ….

సహజంగా రిజర్వ్ డ్ నియోజకవర్గంలో అగ్రకులాల వారిదే ఆధిపత్యంగా ఉంటుంది. అందుకే నామన రాంబాబు, డొక్కా నాధ్ బాబులు తమ మాట వినడం లేదని స్టాలిన్ బాబును బహిష్కరించారన్న వాదన కూడా ఉంది. అయితే స్టాలిన్ బాబు ఇప్పటికే తన రాజీనామా లేఖను టీడీపీ అధిష్టానానికి పంపారు. ఇందుకు కారణాలు కూడా వివరించారు. పార్టీ జిల్లా నేతల వ్యవహారశైలి భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇలా పి.గన్నవరం నియోజకవర్గంలో ఆధిపత్యపోరుతో ఇన్ ఛార్జిని తప్పించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News