వ‌ల్లభ‌నేని పొలిటిక‌ల్ రూటు ఎటు

వల్లభనేని వంశీ మోహన్ పేరు చెబితేనే తెలుగు రాజకీయాలు తెలిసిన వారికి ఈ పేరు తెలియకుండా ఉండదు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎన్నో అంశాలకు కేంద్ర బిందువుగా [more]

Update: 2019-07-09 00:30 GMT

వల్లభనేని వంశీ మోహన్ పేరు చెబితేనే తెలుగు రాజకీయాలు తెలిసిన వారికి ఈ పేరు తెలియకుండా ఉండదు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎన్నో అంశాలకు కేంద్ర బిందువుగా ఉన్న వంశీ తాజా ఎన్నికల్లో విజయం సాధించి మరెన్నో సంచలనాలకు కారణమయ్యారు. తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం ఉన్న వంశీ తొలిసారిగా 2009లో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. గ‌న్నవ‌రం ఎమ్మెల్యే అవ్వాల‌న్న వంశీ రెండు దశాబ్దాల కోరిక ఎట్టకేలకు 2014లో నెరవేరింది. వంశీ కి ఎమ్మెల్యేగా విజయం సాధించక ముందు నుంచే జిల్లాకే చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమతో రాజకీయ వైరం ఉంది.

నానికి అత్యంత సన్నిహితుడు కావడంతో…..

ఎన్నికల్లో ఉమ తోపాటు రాష్ట్రంలోనే టిడిపికి చెందిన మహామహులందరూ చిత్తు చిత్తుగా ఓడిపోయారు. గన్నవరంలో మాత్రం వంశీ 900 ఓట్ల స్వల్ప తేడాతో సంచలన విజయం సాధించారు. దీంతో ఇప్పుడు వచ్చే ఐదేళ్ల పాటు వంశీ పొలిటికల్ రూటు ఎలా ఉండబోతోంద‌న్న‌ది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వంశీ మంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే వీరి మధ్య అనుబంధం ఉంది. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా వంశీకి మంచి స్నేహమే ఉంది.
ఎన్నికలకు ముందే వల్లభనేని వంశీ జగన్ తో ఉన్న స్నేహం నేపథ్యంలో వైసీపీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు జోరుగా వచ్చాయి.

సుజనా బంధువు కావడంతో….

ఈయ‌న మాత్రం టిడిపి టిక్కెట్ పైన పోటీచేసి గెలిచిన‌ 23 మంది ఎమ్మెల్యేలలో వల్లభనేని వంశీ ఒకరిగా మిగిలారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి నుంచి బీజేపీలోకి జంప్ చేసే ఎమ్మెల్యేల లిస్టులో వంశీ పేరు కూడా వినిపించింది. టీడీపీలో పలువురు కీలక నేతలను బిజెపిలోకి తీసుకువెళ్లే బాధ్యతలు చూస్తున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వంశీకి బంధువు అవుతారు. ఈ క్రమంలోనే సుజన వంశీని కూడా బిజెపిలోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన వంశీ సుజనా చౌదరి పార్టీ మామ‌ని అడిగిన మాట వాస్తవమేనని, అయితే తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపిని వీడే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

ఏ పార్టీలో అనేది…..

రాజకీయంగా టిడిపి వచ్చే రెండేళ్లలో మరింత సంకట పరిస్థితులు ఎదుర్కోబోతుంది అన్న చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదే జరిగితే తన రాజకీయ భవిష్యత్తు కోసం అప్పుడున్న పరిస్థితులను బట్టి వంశీ బిజెపి లేదా వైసీపీలలో ఏదో ఒక పార్టీ లోకి చేర‌తార‌ని తెలుస్తోంది. రెండు పార్టీల్లోనూ తనకు అంత సన్నిహితులైన వ్యక్తులే కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ ఏ పార్టీలోకి వెళ్లాలనుకున్నా పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అయితే జిల్లా రాజ‌కీయాల్లోనే కాదు.. టీడీపీలోనూ ఆయ‌న చేయ‌డానికి ఏం లేదు.

Tags:    

Similar News