డోలాయమానంలో డైలాగ్ కింగ్ గెలుపు...!

Update: 2018-05-08 18:29 GMT

సాయికుమార్.... తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. డైలాగ్ కింగ్ గా పేరుగాంచిన సాయికుమార్ సినీనటుడిగానే కాకుండా భారతీయ జనతాపార్టీ నాయకుడిగా కూడా సుపరిచితం. ఒకసారి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయిన ఈ డైలాగ్ కింగ్ ఈసారి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న తపనతో అహరహం కృషి చేస్తున్నారు. సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వ్యక్తిగతప్రతిష్టను పణంగా పెట్టి పోరాడుతున్నారు. బాగేపల్లి నియోజకవర్గంలో విజయ బావుటా ఎగురవేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తారో లేదో తెలియాలంటే ఈ నెల 15వ తేదీ వరకూ ఆగక తప్పదు.

తెలుగు ఓట్లేకీలకం.....

చిక్క బళ్లాపూర్ జిల్లాలోని బాగేపల్లి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉంది. అనంతపురం జిల్లాలోని కదిరికి 53, పెనుకొండకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు-హైదరాబాద్ రహదారి మధ్యలో గల బాగేపల్లి ఓ చిన్న పురపాలకసంఘం. ఇక్కడ తెలుగు ప్రజలు అధికసంఖ్యలో నివసిస్తున్నారు. గెలుపోటముల్లో వీరి పాత్ర, ప్రభావం చాలా ఎక్కువనే చెప్పడం అతిశయోక్తికాదు. బతుకుదెరువు కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడిపోయారు. తెలుగువారి ప్రభావం బాగేపల్లిలో ఎంతో ఎక్కువ. అన్ని పార్టీలుకూడాతెలుగు మూలాలున్న వారినే అభ్యర్థులుగా నిలబెట్టడం ఇందుకు నిదర్శనం. బీజేపీ అభ్యర్థిగా సాయికుమార్ బరిలోకి దిగగా, కాంగ్రెస్ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.ఎస్.సుబ్బారెడ్డి, సీపీఎం తరుపున జీవీ శ్రీరామరెడ్డి తమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు. 2013ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి 66,227 ఓట్లు సాధించి గెలుపొందారు. సీపీఎం తరుపున పోటీ చేసిన శ్రీరామారెడ్డి 35472 ఓట్లు సాధించారు. 1999,2004,2008 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ బాగేపల్లిలో విజయబావుటా ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి ఎస్. సంపంగి మూడు దఫాలు గెలుపొంది నియోజకవర్గంపై తనకున్న పట్టును చాటుకున్నారు. ఈసారికూడా విజయం తమదేనని హస్తం పార్టీ శ్రేణులుధీమాతో ఉన్నాయి.

బాగా సుపరిచితుడు....

బీజేపీ అభ్యర్థి సాయికుమార్ నియోజకవర్గానికి బాగా సుపరిచితుడు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతర కాలంలో వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాలకు దూరమయ్యారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ తరుపున విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, నరేంద్ర మోడీ వ్యక్తిగత చరిష్మా తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. తనను గెలిపిస్తే తాగునీటి సమస్యను తీరుస్తానని, అనుసంధాన రోడ్లను నిర్మిస్తానని, రైతుల సమస్యను పరిష్కరిస్తానని, నిరుద్యోగ సమస్యలను తీరుస్తానంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముస్లింలు సయితం తనకే ఓటువేస్తారని చెబుతున్నారు.

బలిజ సామాజిక వర్గం....

పార్టీలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఎస్.ఎస్. సుబ్బారెడ్డిని కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచిన సంపంగి టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నించినప్పటికీ పార్టీ సుబ్బారెడ్డి వైపే మొగ్గు చూపింది. వాస్తవానికి సుబ్బారెడ్డి 2013లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. సీపీఎం అభ్యర్థి శ్రీరామరెడ్డి పై 30,755 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలిచారు. మంచి మెజారిటీ సాధించడంతో హస్తం పార్టీ ఆయనకే టిక్కెట్ ఇచ్చింది. జనతాదళ్ (ఎస్) సీఆర్ మనోహర్ ను బరిలోకి దింపింది. సినీ నిర్మాత అయిన మనోహర్ గతంలో చిక్కబళ్లాపూర్ నుంచి పోటీ చేసిఓడిపోయారు. 2012లో ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం ప్రయత్నించినప్పటికీ గౌడ పార్టీ మొండిచేయి చూపింది. దీంతో ఆయన అప్పట్లో యడ్యూరప్ప సారథ్యంలోని కర్ణాటక జనతా పార్టీలో చేరి స్థానికసంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున ప్రచారం చేశారు. అయినా 2013 ఎన్నికల్లో కర్ణాటక జనతా పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. తర్వాత కాంగ్రెస్ లో, 2014లో జేడీఎస్ లో చేరారు. సీపీఎం అభ్యర్థి శ్రీరామారెడ్డి నియోజకవర్గంలో గట్టిపట్టున్న నేత. 1994, 2004 ఎన్నికల్లో ఇక్కడి నుంచి రెండుసార్లు వజియం సాధించారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారన్న పేరు ఆయనకు ఉంది. నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. జేడీఎస్ అభ్యర్థి మనోహర్ ఆ సామాజిక వర్గం వారే. బీజేపీ అభ్యర్థి సాయికుమార్ కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన వారు. ప్రజలు సామాజిక వర్గాల పరంగా చూడరని, అభివృద్ధి, విశ్వసనీయత ఆధారంగా ఓటేస్తారని కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు సుబ్బారెడ్డి, శ్రీరామారెడ్డిలు చెబుతున్నారు. ఎంతకాదనుకున్నా సామాజిక వర్గాలను విస్మరించడం ఇవాల్టి రాజకీయాల్లో కష్టమే మరి....!

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News