నారా వారి మ‌రో `ద‌త్తత`రికార్డు!

Update: 2018-04-27 15:30 GMT

రాష్ట్రంలో గ్రామాల ద‌త్తత అనే అంశం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చాలా మంది ప్ర‌ముఖులు తెరమీదికి వ‌స్తుంటారు. వారు పుట్టి పెరిగిన వూరు, లేదా వారి స్వ‌గ్రామం.. ఇలా ఏదో ఒక రూపంలో వారు ఆయా గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకునేం దుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ఇలా ద‌త్త‌త తీసుకుంటున్న వారు.. మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించేలా ఫొటోల‌కు ఫోజు లివ్వ‌డం భారీ ఎత్తున ప్ర‌క‌టించుకోవ‌డం వ‌రకే ప‌రిమితం అవుతున్నారు. ఈ వ‌రుస‌లో అనేక మంది పేర్లు ప్ర‌ముఖంగానే వినిపిస్తున్నాయి. వీటిలో ఇప్పుడు తాజాగా సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ విష‌యం వెలుగు చూసింది.

నిమ్మకూరును దత్తత తీసుకుని.....

మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత గ్రామాల ద‌త్త‌త అంశం వెలుగులోకి వ‌చ్చిన‌ప్పుడు త‌న తాత‌గారు, స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పుట్టిపెరిగిన కృష్ణా జిల్లాలోని నిమ్మ‌కూరును ద‌త్త‌త తీసుకుని డెవ‌ల‌ప్ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌క‌స‌భ్యుడు ఎన్టీఆర్ పుట్టిన ఊరు, ఆయ‌న్ను ఈ ఊరు వాళ్లు ఓట్లేసి అసెంబ్లీకి కూడా పంపించారు (నిమ్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ముందు గుడివాడ‌లో ఉండేది ఇప్పుడు పామ‌ర్రులో ఉంది).

ఆ కాన్సెప్ట్ ను మరచి......

ఇక లోకేష్ ద‌త్త‌త అయితే, తీసుకున్నారు. కానీ, ద‌త్త‌త‌కు, ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు మ‌ధ్య తేడా లేకుండా చేశారు. వాస్త‌వానికి ద‌త్త‌త తీసుకుంటే వారి సొంత నిధుల నుంచి లేదా ఏదైనా వ్యాపార అధినేత నుంచి నిధులు సేక‌రించి, ప్ర‌భుత్వంపై ఎలాంటి భారం ప‌డ‌కుండా త‌మ పేరు ప్ర‌ఖ్యాతుల‌ను వినియోగించి అభివృద్ధి చేయాలి. కానీ, లోకేష్ మాత్రం ఈ కాన్సెప్ట్‌ను మ‌రిచిపోయారు. నిమ్మ‌కూరు అభివృద్ధికి త‌న సొంత నిధుల‌ను ఎంత మేర‌కు ఖ‌ర్చు పెట్టారో తెలియ‌దు కానీ, ఇక్క‌డ చేసిన ఖ‌ర్చు మొత్తం.. ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచే వ‌చ్చింద‌ని అంటున్నారు స్థానికులు. మ‌రి ప్ర‌భుత్వం నుంచి నిధులు తీసుకుని ఖ‌ర్చు చేస్తే.. దానికి ద‌త్త‌త అనే పేరు ఎందుకు పెట్టిన‌ట్టో కూడా అర్ధం కావ‌డం లేదు. ఇదొక మిస్ట‌రీ!

సిక్కోలులో సయితం.....

ఇక‌, ఇప్పుడు ఇదే లోకేష్‌.,. శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించాడు. ఆయ‌న అక్క‌డ సీతంపేట‌, బూర్జ, ఆముదాల వ‌ల‌స మండ‌లాల్లో ప‌ర్య‌టించారు. అనంతరం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించిన లోకేష్, ప్ర‌భుత్వం గిరిజ‌నుల‌కు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ఏక‌రువు పెట్టారు. ప్ర‌బుత్వం అన్ని విధాలా కృషి చేసి గిరిజ‌నుల‌ను అభివృద్ధిలోకి తీసుకు వ‌చ్చేందుకు కృషి చేస్తోంద‌న్నారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న ఇక్క‌డి ఓ గిరిజ‌న గ్రామాన్ని తాను ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. ఈ ప్ర‌క‌ట‌న‌పైనే నెటిజ‌న్లు దెప్పిపొడుస్తున్నారు. ఇప్ప‌టికే తీసుకున్న నిమ్మ‌కూరులో ఎంత ఖ‌ర్చు పెట్టారో మంత్రి వ‌ర్యులు వివ‌రించాల‌ని కోరుతున్నారు. ప్ర‌భుత్వ నిధుల‌తో అభివృద్ధి చేసేట‌ప్పుడు.. ద‌త్త‌త అని పేరు పెట్టుకోవ‌డం, డ‌బ్బా కొట్టుకోవ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు. సొంత నిధులను కేటాయించి ఉంటే ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని కోరుతున్నారు. లేదా నిమ్మ‌కూరు మాదిరిగానే ఇక్క‌డ కూడా ప్ర‌భుత్వ నిధుల‌తోనే అభివృద్ధి చేస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామం.. ద‌త్త‌త స్వ‌రూపాన్నే ప్ర‌శ్నార్థ‌కం చేస్తోంది.

Similar News