భూమాకు..చెక్...ఏవీకే ఛాన్స్?

Update: 2018-04-13 09:30 GMT

నంద్యాల పంచాయతీ తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిన్న మంత్రి అఖిలప్రియ, భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి సమావేశమయిన సంగతి తెలిసిందే. ఈ పంచాయతీని చంద్రబాబు చాలా వరకూ చక్క దిద్దేనట్లే కన్పిస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భూమా ఫ్యామిలీకి షాకిచ్చే సిగ్నల్స్ బాబు నుంచి వచ్చినట్లు నేతలు చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో భూమా ఫ్యామిలీకి ఒక్క టిక్కెట్ మాత్రమే ఇస్తారన్న చర్చ ఆ సమావేశం తర్వాత జోరుగా జురుగుతోంది. ఏవీ సుబ్బారెడ్డిని మాత్రం ఆళ్లగడ్డలో జోక్యం చేసుకోవద్దని సుతిమెత్తంగాహెచ్చరించి నట్లు చెబుతున్నారు.

విభేదాలు తారాస్థాయికి....

నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోని టీడీపీలో ఇటీవల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. మంత్రి అఖిలప్రియకు, భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అఖిల, భూమా బ్రహ్మానందరెడ్డికి వ్యతిరరేకంగా ఆళ్లగడ్డ, నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి విడిగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇది కాస్తా రచ్చగా మారింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలనూ చంద్రబాబు చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో ఏవీసుబ్బారెడ్డిని ఆళ్లగడ్డ విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోనని హెచ్చిరించినట్లు తెలిసింది.

ఆళ్లగడ్డలో జోక్యం చేసుకోవద్దంటూ.....

ఆళ్లగడ్డ అఖిలప్రియ సొంత నియోజకవర్గం. ఆళ్లగడ్డలో జోక్యం చేసుకోవద్దంటే.... నంద్యాలలో జోక్యం చేసుకోమనే కదా? అని అర్థాలు తీస్తున్నారు ఏవీ అనుచరులు. నంద్యాలలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి సోదరుడు కొడుకు బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. ఆ ఉప ఎన్నికల్లో ఏపీ కేబెనెట్, ముఖ్యమంత్రి తో సహా వచ్చి కూర్చుంటే గాని గెలుపు సాధ్యం కాలేదు. ఈ విషయం చంద్రబాబుకూ తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిలప్రియను పోటీ చేయించి, నంద్యాలలో మాత్రం అభ్యర్థిని మారుస్తారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తోంది.

ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వరా?

భూమా మరణం తర్వాత నంద్యాలలో ఆయన అనుచరులు ఎక్కువగా ఏవీ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నారు. ఏవీకూడా భూమా క్యాడర్ పక్కకు పోకుండా కాపాడుకోగలుగుతున్నారు. కాని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి యువకుడు, చిన్న వయస్సు కావడంతో అందరితో కలిసి వెళ్లలేకపోతున్నారు. పైగా నంద్యాల సీటుపై ఎస్పీవై రెడ్డి కుటుంబం కూడా కన్నేసింది. ఎస్పీవై రెడ్డి తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎన్నికల నాటికి సీటు ఎవరికిస్తారన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, భూమా ఫ్యామిలీకి నంద్యాల టిక్కెట్ లేదన్న సంకేతాలు బాబు ఇచ్చేశారంటున్నారు. అందుకే ఏవీ సమావేశం తర్వాత సంతోషంగా కలసి పనిచేస్తామని చెప్పి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద నంద్యాల రాజకీయం రోజుకో మలుపులు తిరుగుతోంది.

Similar News