ఏడాది వరకూ ఢోకా లేదు...!

Update: 2018-05-25 16:30 GMT

కుమారస్వామి బలపరీక్షలో నెగ్గారు...కాని అసలు పరీక్ష ముందుంది. 2019 లోక్ సభ ఎన్నికల వరకూ కుమారస్వామి ప్రభుత్వానికి ఢోకా లేదన్నది విశ్లేషకుల అంచనా. ముఖ్యంగా కుమారస్వామికి కేబినెట్ కూర్పు, రెండు పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సవాళ్లుగా మారనున్నాయి. కుమారస్వామితో పాటు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి వర్గం ఇంకా ప్రమాణస్వీకారంచేయాల్సి ఉంది. దీనిపై రెండు పార్టీల మధ్య చర్చలు జరగనున్నాయి. కాంగ్రెస్ కు 22 మందికి, జేడీఎస్ కు 12 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని తొలుత నిర్ణయించారు.

మంత్రి వర్గ కూర్పు....

అయితే కాంగ్రెస్ లో మంత్రివర్గ కూర్పునకు సంబంధించి చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇటు సిద్ధరామయ్య వర్గం, అటు డీకే శివకుమార్ వర్గం కూడా గట్టిగా పట్టుబడుతోంది. తమ వర్గానికి చెందిన వారికే ఇవ్వాలంటూ రెండు వర్గాలు చర్చల్లో పట్టుబడుతున్నాయి. అయితే అసంతృప్తులను ఎంతవరకూ సంతృప్తి పరుస్తారో తెలియదు కాని కుమారస్వామి సర్కార్ కు మాత్రం మరో ఆరు నెలల పాటు ఢోకా లేదు. ఆరు నెలల అనంతరం కుమారస్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ఆరు నెలల్లో కుమారస్వామి అన్నీ సెట్ చేయాలని భావిస్తున్నారు.

హామీలు అమలు సవాలే....

ఇక రైతు రుణమాఫీ, రైతులకు 24 గంటల విద్యుత్తు సరఫరా వంటి హామీలను అమలుపర్చాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కూడా తన మేనిఫేస్టో అమలుకు కుమారస్వామిపై వత్తిడి ఖచ్చితంగా తెస్తోంది. కాంగ్రెస్ కు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించాలన్న లక్ష్యం ఉండటంతో మేనిఫేస్టో అమలుకు పట్టుబట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి ఎలా నెట్టుకొస్తారన్నది ప్రశ్నార్థకమే. మరోవైపు స్పీకర్ సయితం కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ ఏకగ్రీవంగా నెగ్గారు. ఇది కాంగ్రెస్ కు అనుకూలమైన పరిణామమే.

సోమవారం కర్ణాటక బంద్.....

మరోవైపు బీజేపీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకుంది. బలపరీక్ష ఈరోజు నెగ్గితే సోమవారమే కర్ణాటక బంద్ కు బీజేపీ పిలుపునివ్వడం విశేషం. కాంగ్రెస్, జేడీఎస్ లది అపవిత్ర కలయికని, ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని ఆరోపిస్తూ బీజేపీ కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చింది. సోమవారమే కుమారస్వామి తన మంత్రివర్గ సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించాలని భావించారు. అందుకోసం కసరత్తులు చేస్తున్నారు. అదేరోజు బంద్ కు పిలుపునివ్వడంతో మరి మంత్రి వర్గ ప్రమాణస్వీకారం ఉంటుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Similar News